స్మార్ట్‌గా స్వ‌ర్ణాంధ్ర దిశ‌గా సాగు..!

ఆధునిక సాంకేతిక‌త‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి
ప్ర‌కృతి సేద్యంతో రైతుల‌కు సుస్థిర ఆదాయం
మ‌ట్టికి, మ‌నిషి ఆరోగ్యానికీ, ప‌ర్యావ‌ర‌ణానికీ ఎంతో మేలు
విచ్చ‌ల‌విడిగా ర‌సాయ‌న ఎరువులను వినియోగించొద్దు
20 సూత్రాల అమ‌లు క‌మిటీ ఛైర్మ‌న్ లంకా దిన‌క‌ర్‌, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్‌

వత్సవాయి, ఆంధ్రప్రభ : ఆధునిక సాంకేతిక‌త‌తో స్మార్ట్ సాగు విధానాల‌తో ప్ర‌కృతి వ్య‌వ‌సాయం వ‌ల్ల మ‌న ప‌ర్యావ‌ర‌ణానికి, సుస్థిర ఆదాయం పొందేందుకు వీలవుతుంద‌ని 20 సూత్రాల అమ‌లు క‌మిటీ ఛైర్మ‌న్ లంకా దిన‌క‌ర్ అన్నారు. సోమ‌వారం జిల్లా వ్య‌వ‌సాయ శాఖ ఆధ్వ‌ర్యంలో వ‌త్స‌వాయి మండ‌లం, క‌న్నెవీడు గ్రామంలో జిల్లాస్థాయి ఏరువాక పౌర్ణ‌మి కార్య‌క్ర‌మం జ‌రిగింది. వ్య‌వ‌సాయ ప‌నులు ప్రారంభ‌మ‌య్యే శుభ‌త‌రుణంలో లంకా దిన‌క‌ర్‌తో పాటు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌, ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ త‌దిత‌రులు అన్న‌దాత‌లకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా లంకా దిన‌క‌ర్ మాట్లాడుతూ… విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల మట్టి సారం తగ్గిపోవడంతో పాటు మనిషి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం ప‌డుతోంద‌న్నారు. విదేశాల‌కు మ‌నం ఎగుమ‌తి చేసే వివిధ వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు తిర‌స్క‌ర‌ణ‌కు గురై తిరిగి వెన‌క్కు రావ‌డానికి కార‌ణం విచ్చ‌ల‌విడిగా ర‌సాయ‌న ఎరువులు, పురుగుమందులు వాడ‌ట‌మేన‌ని పేర్కొన్నారు. ప్ర‌కృతి వ్య‌వసాయం వ‌ల్ల అన్న‌దాత‌ల‌కు మంచి ఆదాయం చేకూరుతుంద‌ని.. మిర్చినే తీసుకుంటే ఎరువుల‌తో సాగుచేసే మిర్చికి రూ. 25 వేల వ‌ర‌కు ఆదాయం వ‌స్తే ప్ర‌కృతి సేద్యంతో ఉత్ప‌త్త‌య్యే మిర్చికి రూ. 50 వేల వ‌ర‌కు ఆదాయం వ‌స్తోంద‌న్నారు. ఖ‌ర్చు ఎక్కువ, దిగుబ‌డి త‌క్కువ వంటి అపోహ‌లు వీడి ప్ర‌తిరైతూ సేంద్రియ సాగు దిశ‌గా వెళ్లాల‌ని సూచించారు. అన్న‌దాత‌ల సంక్షేమానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లుచేస్తున్న ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని.. అన్న‌దాత సుఖీభ‌వ‌, పీఎం కిసాన్ నిధుల‌కు పెట్టుబ‌డి సాయంకోసం ఉప‌యోగించుకొని మంచి ఆదాయాలు పొందాల‌ని లంకా దిన‌క‌ర్ సూచించారు.

హైటెక్ సాగుతో రైతే రాజు…

వ్య‌వ‌సాయ డ్రోన్లు, స్మార్ట్ ఉప‌క‌ర‌ణాలు, ప్ర‌త్యేక యాప్‌లు ఇలా సాంకేతిక‌త‌ను ఉప‌యోగించుకుంటూ అన్న‌దాత‌లు మంచి దిగుబ‌డులు, ఆదాయాలు పొందాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. అందుబాటులో ఉన్న భూమిని స‌ద్వినియోగం చేసుకొని ఆరోగ్య‌క‌ర వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను పొంద‌డం ద్వారా స్వ‌ర్ణాంధ్రకు, భావిత‌రాల‌కు మంచిద‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, సాంకేతిక సేవలను రైతులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఏపీ ఎయిమ్స్ (ఏపీ అగ్రిక‌ల్చ‌ర్ ఇన్ఫ‌ర్మేష‌న్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌) యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింద‌ని.. ఈ యాప్ ద్వారా సమగ్ర వ్యవసాయ సాంకేతిక సమాచారం రైతుల మొబైల్ ఫోన్ల‌లోనే సులభంగా అందుబాటులోకి వచ్చింద‌ని వివ‌రించారు. పంటల సాగు విధానాలు, పంటల నిర్వహణ, వాతావరణ సమాచారం, వ్యవసాయ సలహాలు, ప్రభుత్వ పథకాల వివరాలు, వ్యవసాయ శాఖ సేవలు తదితర అంశాలను రైతులు ఒకే వేదికపై పొందవచ్చ‌న్నారు. ఏ పంట‌కు ఎంత ఎరువు వాడాలో అంతే వినియోగించాల‌ని.. అదేవిధంగా నానో ఎరువుల వినియోగం వ‌ల్ల బ‌హుళ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వివ‌రించారు.

అన్న‌దాత సంక్షేమానికి ప్ర‌భుత్వం కృషి…

రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌ని, రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని జ‌గ్గ‌య్య‌పేట శాస‌న‌స‌భ్యులు శ్రీరాం రాజ‌గోపాల్ అన్నారు. ప‌ల్లెల్లో అనుబంధాలు, సాగుతో వ‌చ్చే సంతృప్తి మ‌రెక్క‌డా ఉండ‌ద‌న్నారు. సేంద్రియ వ్యవసాయం, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాలు, మార్కెట్ సమాచారం, వ్యవసాయ సలహాలను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.
కార్య‌క్ర‌మంలో ఏఎంసీ ఛైర్మ‌న్ ఎం.సీత‌మ్మ‌, పీఏసీఎస్ క‌న్నెవీడు ప్రెసిడెంట్ కె.శంక‌రరావు, జిల్లా వ్య‌వ‌సాయ అధికారి డీఎంఎఫ్ విజ‌య‌కుమారి, ప‌శుసంవ‌ర్థ‌క అధికారి డా. ఎం.హనుమంత‌రావు, స్థానిక పెద్ద‌లు వ‌డ్ల‌మూడి రాంబాబు, వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది, పెద్దఎత్తున రైతులు పాల్గొన్నారు.