Child Rape Murder | చిన్నారిపై అఘాయిత్యం.. పూణే కోర్టు సంచలన తీర్పు
Child Rape Murder | చిన్నారిపై అఘాయిత్యం.. పూణే కోర్టు సంచలన తీర్పు
Child Rape Murder | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పసితనం అంటే అమాయకత్వానికి ప్రతిరూపం. అలాంటి మూడున్నరేళ్ల చిన్నారిపై జరిగిన అమానుషాని్కి న్యాయం కోసం ఎదురుచూసిన ప్రజలకు పుణే సెషన్స్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సమాజాన్ని కలిచివేసిన ఈ దారుణాన్ని “రేరెస్ట్ ఆఫ్ ది రేర్” కేసుగా అభివర్ణించిన కోర్టు, దోషికి మరణశిక్ష విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. నిందితుడిలో పశ్చాత్తాపం లేకపోవడం, నేర తీవ్రత, బలమైన సాక్ష్యాధారాల నేపథ్యంలో ఉరిశిక్షే సరైన శిక్ష అని స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళితే.. పూణే జిల్లాలోని భోర్ తాలూకా నస్రాపూర్ గ్రామంలో మే 1న ఆడుకోవడానికి తన ఇంటికి వచ్చిన మూడేళ్ల బాలికపై భీమ్రావ్ కాంబ్లే అనే 65 ఏళ్ల వృద్ధుడు అత్యంత పాశవికంగా అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడు. చిన్నారికి , ఆవు దూడను చూపిస్తానని ఆశచూపి పశువుల పాకలో దారుణానికి ఒడిగట్టాడు.
మూడున్నరేళ్ల పసికందుపై అత్యంత అమానుషంగా అత్యాచారం, హత్యకు పాల్పడిన ఈ కేసులో దోషిగా తేలిన 65 ఏళ్ల భీమ్రావ్ కాంబ్లేకు కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎస్.ఆర్. సాలుంఖే.. ఈ ఉదంతం “అరుదైన వాటిల్లో అత్యంత అరుదైన” కోవలోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఉరితీయాలని ఆదేశించారు.
కాగ గత వారమే ప్రత్యేక పోక్సో కోర్టు ఇతడిని దోషిగా నిర్ధారించింది. నిందితుడిపై ఉన్న నేరాన్ని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ ఆధారాలను, ఫోరెన్సిక్ సాక్ష్యాలను బలంగా కోర్టుకు సమర్పించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిసార్ వాదనలు వినిపిస్తూ.. పోస్ట్మార్టం నివేదిక ప్రకారం పసికందు శరీరంపై 18 గాయాలు ఉన్నట్లు కోర్టుకు వివరించారు. ఈ కేసు అత్యంత క్రూరమైనదని వాదిస్తూ సుప్రీంకోర్టుకు చెందిన 12 మునుపటి తీర్పులను ఆయన ఉదహరించారు.
కాంబ్లే దోషిగా తేలినప్పటికి తనలో ఎలాంటి పశ్చాత్తాపం లేకపోవడం, తాను ఏ తప్పూ చేయలేదని వాదించడంతో నిందితుడిలో మారాలనే ఆలోచన ఎక్కడా కనిపించడం లేదని, అందువల్ల ఇతనికి ఉరిశిక్ష మాత్రమే సరైన నిర్ణయమని కోర్టు అభిప్రాయపడింది.
బలమైన ఆధారాలు.. పాత నేర చరిత్ర..
ఈ కేసులో ప్రాసిక్యూషన్ సమర్పించిన సీసీటీవీ ఫుటేజ్, డీఎన్ఏ ఆధారాలు, వైద్య నివేదికలు, పొటెన్సీ టెస్ట్ (సామర్థ్య పరీక్ష) , నిందితుడి మానసిక స్థితికి సంబంధించిన నివేదికలను కోర్టు పూర్తిగా అంగీకరించింది. అంతేకాకుండా, నిందితుడైన కాంబ్లేకు గతంలో ఒక 62 ఏళ్ల వృద్ధురాలితో, 17 ఏళ్ల అమ్మాయితో , ఒక జంతువుతో నేర చరిత్ర ముడిపడి ఉందని కోర్టు దృష్టికి వచ్చింది.
ఈ తీర్పుపై మహారాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ నీలం గోర్హే స్పందిస్తూ.. వేగంగా విచారణ పూర్తి చేసి తీర్పునిచ్చిన న్యాయవ్యవస్థకు
ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసును ప్రభుత్వం మొదటి నుండి అత్యంత తీవ్రంగా పరిగణించిందని, మైనర్ బాలికలపై జరిగే ఇలాంటి ఘోరమైన నేరాలకు చట్టంలో ఉన్న అత్యున్నత శిక్ష పడాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.
