ఒక రోజు పూర్తవ్వాలంటే… ఒక సంవత్సరం సరిపోదు..!

  • ఇలాంటి విచిత్రం ఇంకెక్కడా లేదు..!
  • అన్నీ గ్రహాల్లో కల్లా.. ఈ గ్రహం వేరప్పా..!
  • సౌర కుటుంబంలో ‘రివర్స్ గేర్’లో నడిచేది ఇదొక్కటే..!

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : మనం నివసిస్తున్న భూమిపై ఒక రోజు అంటే 24 గంటలు.. ఒక సంవత్సరం అంటే 365 రోజులు. ఇది అంద‌రికీ తెలిసిందే. అలాగే, దాదాపు అన్ని గ్రహాల్లో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అంటే.. ఒక గ్రహం తన చుట్టూ తాను తిరిగే సమయం (ఒక రోజు) క‌న్నా…. సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగే సమయం (ఒక సంవత్సరం) ఎక్కువగా ఉంటుంది.

కానీ.. సౌర కుటుంబంలో ఓ గ్రహం మాత్రం అందరికీ భిన్నం. “మీరంతా ఒక దారి.. నేను ఒక్కదాన్నే మరో దారి” అన్నట్లుగా వ్యవహరిస్తుంది. ఆ గ్రహంపై ఒక రోజు.. ఒక సంవత్సరం కంటే ఎక్కువ! అంటే.. అది సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయం కంటే.. తన చుట్టూ తాను ఒక్కసారి తిరగడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం.

ఆ గ్రహమే వీనస్ (శుక్ర గ్రహం). వీనస్ సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి కేవలం 225 రోజులు మాత్రమే పడుతుంది. కానీ తన అక్షం చుట్టూ ఒకసారి పూర్తిగా తిరగడానికి 243 భూమి రోజులు పడుతుంది. అంటే వీనస్‌పై ఒక రోజు… అక్కడి ఒక సంవత్సరం కంటే 18 రోజులు ఎక్కువ అన్నమాట. దీనికి ప్రధాన కారణం వీనస్ చాలా నెమ్మదిగా తన అక్షం చుట్టూ తిరగడమే.

అంతేకాదు, సౌర కుటుంబంలోని చాలా గ్రహాలు పశ్చిమం నుంచి తూర్పు దిశగా తిరుగుతాయి. కానీ వీనస్ మాత్రం తూర్పు నుంచి పశ్చిమం దిశగా తిరుగుతుంది. దీనినే శాస్త్రవేత్తలు రిట్రోగ్రేడ్ రొటేషన్ (Retrograde Rotation) అని పిలుస్తారు. అందుకే అక్కడ సూర్యుడు మనకు కనిపించే దిశకు విరుద్ధంగా పడమరలో ఉదయించి తూర్పున అస్తమిస్తాడు.

వీనస్ (శుక్రగ్రహం) పరిమాణంలో భూమికి దగ్గరగా ఉన్నప్పటికీ, అక్కడి వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్‌తో నిండిన వాతావరణం కారణంగా అక్కడ ఉష్ణోగ్రతలు 460 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయి. అందుకే శుక్రగ్రహాన్ని సౌర కుటుంబంలోని అత్యంత వేడిగా ఉండే గ్రహంగా శాస్త్రవేత్తలు పేర్కొంటారు. ఒక రోజు… ఒక సంవత్సరం కంటే ఎక్కువగా ఉండే ఈ విచిత్రమైన లక్షణం వల్లే వీనస్ సౌర కుటుంబంలోని అత్యంత ప్రత్యేకమైన గ్రహాల్లో ఒకటిగా నిలిచింది.

మిగతా గ్రహాల సంగతేంటి..?

సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే బుధ గ్రహం (మెర్క్యురీ) తన చుట్టూ తాను తిరగడానికి 59 రోజులు తీసుకుంటే, సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు తీసుకుంటుంది. ఇక మన భూమి (ఎర్త్) విషయానికి వస్తే, తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు (1 రోజు), సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు (1 సంవత్సరం) పడుతుంది. అంగారక గ్రహం (మార్స్) కూడా దాదాపు భూమిలాగే తన చుట్టూ తాను తిరగడానికి 24.6 గంటలు తీసుకుంటుంది, కానీ సూర్యుని చుట్టూ తిరగడానికి దీనికి 687 రోజులు పడుతుంది. ఈ మూడు గ్రహాల్లోనూ రోజు కంటే సంవత్సర కాలమే చాలా పెద్దది.

సౌరకుటుంబంలోనే అతిపెద్ద గ్రహమైన బృహస్పతి (జుపిటర్) అత్యంత వేగంగా తిరుగుతుంది. ఇది కేవలం 10 గంటల్లోనే తన చుట్టూ తాను ఒకసారి తిరిగేస్తుంది. కానీ, సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి దీనికి 12 భూసంవత్సరాలు పడుతుంది. అలాగే అందమైన వలయాలు ఉన్న శని గ్రహం (శాటర్న్) తన చుట్టూ తాను తిరగడానికి 10.7 గంటలు తీసుకుంటే, సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఏకంగా 29 భూసంవత్సరాల సుదీర్ఘ సమయం పడుతుంది.

సూర్యునికి చాలా దూరంగా ఉండే యూరేనస్ తన చుట్టూ తాను తిరగడానికి 17.2 గంటలు తీసుకుంటుంది, కానీ సూర్యుని చుట్టూ దీని ఒక కక్ష్య పూర్తి కావడానికి 84 సంవత్సరాలు పడుతుంది. ఇక చివరి గ్రహమైన నెప్ట్యూన్ తన చుట్టూ తాను 16 గంటల్లోనే తిరిగేసినప్పటికీ, సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి దీనికి దాదాపు 165 భూసంవత్సరాల కాలం పడుతుంది.

ఈ విధంగా శుక్రగ్రహం మినహా సౌర కుటుంబంలోని అన్ని గ్రహాల్లో ఒక రోజు కంటే ఒక సంవత్సరమే ఎక్కువగా ఉంటుంది. కానీ శుక్రగ్రహం మాత్రం ఆ నియమాన్నే తిరగరాసింది. అక్కడ ఒక సంవత్సరం పూర్తయ్యేలోపే… ఒక రోజు కూడా పూర్తికాదు! అందుకే సౌర కుటుంబంలోని అన్నీ గ్రహాల్లో కల్లా.. ఈ గ్రహం వేరప్పా..!