5 రోజులపాటు సీఎం సీమ జిల్లాల్లోనే..
తిరుపతి/రాయలసీమ, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జులై 1 నుంచి 5 వరకు ఐదు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఆయా ప్రాంతాల్లోనే రాత్రి బస చేయనున్నారు.
ఖరారైన షెడ్యూల్ ప్రకారం జులై 1న నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ సమీపంలో సుమారు రూ.750 కోట్ల పెట్టుబడులతో హీరో మోటోకార్ప్ ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. ఆ రాత్రి శ్రీసిటీలోనే బస చేయనున్నారు.
జులై 2న ఉదయం తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (VB-GRAMG) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం తిరుపతిలో జరిగే జీఎస్డీపీ సామర్థ్య వృద్ధి (Capacity Building) వర్క్‌షాప్‌లో నీతి ఆయోగ్ సభ్యులు, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులతో కలిసి పాల్గొని తిరుపతిలోనే బస చేస్తారు.
జులై 3న కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం చిత్తూరు జిల్లా కుప్పానికి చేరుకుని మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.
జులై 3 నుంచి 5 వరకు కుప్పంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. జులై 5 సాయంత్రం అమరావతికి తిరిగి వెళ్లనున్నారు.
