వర్షంలో సింహాద్రి గర్జన..!

  • ఎలిమినేటర్‌లో సన్ షైనర్స్‌కు షాక్
  • వర్షం కారణంగా 6 ఓవర్లకే పరిమితం..
  • 16 పరుగుల తేడాతో సింహాద్రి లయన్స్ ఘన విజయం
  • హనీష్ రెడ్డి మెరుపు బ్యాటింగ్..
  • విజయ్, వినయ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సన్ షైనర్స్‌కు చెక్
  • ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన విజయవాడ…
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా హనీష్ రెడ్డి..
  • 12 బంతుల్లో 36 పరుగులతో విజయంలో కీలక పాత్ర
  • తదుపరి దశకు దూసుకెళ్లిన సింహాద్రి లయన్స్..

ఆంధ్రప్రభ, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026 ప్లే ఆఫ్స్‌కు వర్షం అడ్డంకిగా మారినా, సింహాద్రి లయన్స్ ఆటతీరును మాత్రం ఏమాత్రం నిలువరించలేకపోయింది. ఆదివారం మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ పోరులో సింహాద్రి లయన్స్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటుతూ విజయవాడ సన్ షైనర్స్‌పై 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లింది. వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్‌ను 6 ఓవర్లకు కుదించినా ఉత్కంఠ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

గర్జించిన సింహాద్రి…

మొదట బ్యాటింగ్ చేసిన సింహాద్రి లయన్స్ ఆరు ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. హనీష్ రెడ్డి కేవలం 12 బంతుల్లో 36 పరుగులు చేసి బౌలర్లపై విరుచుకుపడగా, ధనుష్ 10 బంతుల్లో 27 పరుగులతో దూకుడుగా ఆడి జట్టుకు బలమైన స్కోరు అందించాడు.

విజయవాడ బౌలర్లలో ప్రణవ్ రెడ్డి రెండు వికెట్లు, టి. భరత్, లలిత్ మోహన్ చెరో వికెట్ తీశారు. 85 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విజయవాడ సన్ షైనర్స్‌కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఖాతా తెరవకముందే తొలి రెండు వికెట్లు కోల్పోవడంతో జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. అశ్విన్ హెబ్బర్ (16), షేక్ జకీర్ అబ్బాస్ (21), సి. సిద్ధార్థ (15) పోరాడినా అవసరమైన రన్‌రేట్‌కు అనుగుణంగా ఆడలేకపోయారు.

నిర్ణీత ఆరు ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 68 పరుగులకే పరిమితమై టోర్నీ నుంచి నిష్క్రమించారు. సింహాద్రి లయన్స్ బౌలర్లలో విజయ్, వినయ్ చెరో రెండు వికెట్లు తీసి విజయవాడ బ్యాటింగ్‌ను కుప్పకూల్చగా, గిరినాథ్ రెడ్డి మరో వికెట్‌తో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చిన హనీష్ రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో సింహాద్రి లయన్స్ టైటిల్ వేటలో మరో అడుగు ముందుకేసి, విజయవాడ సన్ షైనర్స్ ఈ సీజన్ ప్రయాణానికి ముగింపు పలికింది.