రైతు ఆశీర్వాద సభకు ట్రాఫిక్ ఏర్పాట్లు..
- సీఎం రేవంత్ సభకు వచ్చే ప్రజలకు పోలీసులు కీలక సూచనలు
- మండలాల వారీగా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు.. వైరా ఏసీపీ సారంగపాణి వెల్లడి
ఖమ్మం బ్యూరో : ఈ నెల 30న చింతకాని మండలం జగన్నాధపురంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఏర్పాట్లపై వైరా ఏసీపీ సారంగపాణి కీలక సూచనలు చేశారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ప్రజలు నిర్దేశించిన మార్గాల్లోనే ప్రయాణించి సభా ప్రాంగణానికి చేరుకోవాలని కోరారు. సభకు వచ్చే ప్రజలంతా ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, తమకు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను నిలిపి సభా వేదికకు చేరుకోవాలని సూచించారు.
మండలాల వారీగా ట్రాఫిక్ మార్గాలు ఇలా ఉన్నాయి..
పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, ముదిగొండ మండలం నుంచి వచ్చే బస్సులు, ప్రజలు వెంకటగిరి ఎక్స్‌రోడ్ వద్ద జాతీయ రహదారిపైకి ఎక్కి, థంసలాపురం వద్ద దిగి, పందిళ్లపల్లి మీదుగా వచ్చి పార్కింగ్ స్థలాలు 1 నుంచి 5 వరకు వినియోగించుకోవాలి.
కారేపల్లి, కామేపల్లి మండలాల నుంచి వచ్చే వారు ఖమ్మం–ముస్తఫానగర్ మీదుగా పందిళ్లపల్లి చేరుకుని పార్కింగ్ స్థలాలు 1 నుంచి 5 వరకు వినియోగించుకోవాలి.
సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూర్, కల్లూరు మండలాల నుంచి వచ్చే ప్రజలు కల్లూరు వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎక్కి, కోదుమూరు వద్ద దిగి, చింతకాని మీదుగా వచ్చి పార్కింగ్ స్థలాలు 7, 8, 15లో వాహనాలు నిలపాలి.
వైరా, కొనిజర్ల మండలాల నుంచి వచ్చే వారు బస్వాపురం–పెద్దగోపతి–నేరేడు మీదుగా చింతకాని చేరుకుని పార్కింగ్ స్థలాలు 7, 8, 15 వినియోగించుకోవాలి.
ఏన్కూరు, తల్లాడ మండలాల నుంచి వచ్చే ప్రజలు వి. వెంకటాయపాలెం–వందనం–చింతకాని మార్గంలో వచ్చి పార్కింగ్ స్థలాలు 7, 8, 15లో వాహనాలు నిలపాలి.
ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, చింతకాని మండలాల నుంచి వచ్చే వారు బోనకల్లు–నాగలంచ మార్గంలో వచ్చి పార్కింగ్ స్థలాలు 10, 11, 12, 13, 14లో వాహనాలు పార్క్ చేయాలని సూచించారు.
చింతకాని మండలం మత్కేపల్లి–నామవరం వైపు ఉన్న ముదిగొండ మండల గ్రామాల ప్రజలు మత్కేపల్లి క్రాస్‌రోడ్డు నుంచి పందిళ్లపల్లి మీదుగా వచ్చి పార్కింగ్ స్థలాలు 1 నుంచి 5 వరకు వినియోగించుకోవచ్చని ఏసీపీ తెలిపారు.




