చిన్నారుల సంపూర్ణ ఆరోగ్య రక్షణే లక్ష్యం..
విజయరాయిలో పల్స్ పోలియోకు శ్రీకారం
చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. ప్రతి బిడ్డకు రక్షణ కల్పించాలని పిలుపు
ఏలూరు, ఆంధ్రప్రభ: భావి భారత పౌరులైన చిన్నారుల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గంలోని ప్రతి బిడ్డకు సురక్షితమైన భవిష్యత్తు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
“నిండైన జీవితానికి రెండే పోలియో చుక్కలు” అనే నినాదంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పెదవేగి మండలం విజయరాయి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానిక కూటమి నాయకులు, వైద్యాధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కేంద్రంలో ఉన్న చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, తన చేతుల మీదుగా స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రులు, సంరక్షకుల కనీస బాధ్యత అని అన్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వైద్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో ప్రతి గ్రామానికి ఈ సేవలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షుడు ఈడుపుగంటి అనిల్, ఎంపీడీవో నాగేంద్ర, వైద్యాధికారులు డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ మల్లికార్జున్, కూటమి నాయకులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
