ప్రతిభకు పెరిక సంఘం ప్రోత్సాహం

  • మెరిట్ విద్యార్థులకు షీల్డ్‌లు, నగదు బహుమతులు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : పెరిక సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన పెరిక విద్యార్థిని, విద్యార్థులను ఘనంగా సన్మానించారు. అచ్చంపేట పట్టణంలోని పెరిక సంఘం భవనంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు షీల్డ్‌లు, నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుల పెద్ద పోకల మనోహర్ విద్యార్థులకు షీల్డ్‌లు బహుకరించి నగదు ప్రోత్సాహకాలను అందించారు.

అనంతరం శాలువాలతో కప్పి వారిని ఘనంగా సత్కరించారు. చదువులో రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు. అలాగే ఇటీవల జరిగిన అచ్చంపేట పబ్లిక్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన అంగిరేకుల బిక్షపతి, కోశాధికారిగా ఎన్నికైన పోకల ప్రవీణ్ ను కుల పెద్దలు మరియు సంఘ సభ్యులు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోకల శ్రీధర్, పోస్ట్ ఆఫీస్ శ్రీనివాసులుతో పాటు పెరిక సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.