ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు..
పోలియో రహిత సమాజ నిర్మాణానికి ముందడుగు
ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం.. మండలవ్యాప్తంగా వేలాది మంది చిన్నారులకు చుక్కలు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: పోలియో నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ కండక్టర్ తిమ్మప్ప చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటస్వామి చౌదరి మాట్లాడుతూ, ఉరవకొండ పట్టణంలోని 20 పోలియో కేంద్రాల్లో 4,340 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సాహితి, డాక్టర్ వినత, స్టాఫ్ నర్సులు, ఆరోగ్య కార్యకర్త నిమ్మల వెంకటేశులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
అదేవిధంగా మండలంలోని రాకెట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రాకెట్ల, మోపిడి, ఆమిద్యాల, చిన్నముష్టూర్, పెద్దముష్టూర్, ఇంద్రావతి, రాయంపల్లి, వ్యాసాపురం, నెరమెట్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
రాకెట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ పావని, డాక్టర్ వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ, తమ పరిధిలోని 14 పోలియో కేంద్రాల ద్వారా 3,152 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీహెచ్వో నాగ రంగయ్య, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ షఫీ, సూపర్వైజర్లు స్వర్ణలత, శేఖర్, ఏఎన్ఎం ఆశాజ్యోతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
