accident | వరుసగా మూడు కార్లు ఢీ
accident | వరుసగా మూడు కార్లు ఢీ
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం..
● టైర్ పేలడంతో అదుపుతప్పిన కారు.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
● విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభింపు
accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పేలడంతో అదుపుతప్పిన ఓ కారు బోల్తా పడగా, వెనుక నుంచి వస్తున్న మరో రెండు కార్లు ఢీకొనడంతో ప్రమాదం మరింత తీవ్రరూపం దాల్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ వైపు వెళ్తున్న ఓ కారు అకస్మాత్తుగా టైర్ పేలడంతో అదుపుతప్పి డివైడర్‌ను దాటి హైదరాబాద్ వైపు రోడ్డుపై బోల్తా పడింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న రెండు కార్లు బోల్తాపడిన వాహనాన్ని గమనించలేక బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనం కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.
ఈ ఘటనలో కార్లలో ప్రయాణిస్తున్న సుమారు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా, వారిని స్థానికులు, పోలీసులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదంతో మూడు కార్లు రహదారిపై అడ్డంగా నిలిచిపోవడంతో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై సుమారు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
