వేగంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు
- 35 శాతం పనులు పూర్తి..
- భక్తులకు మెరుగైన దర్శనం, వసతులే లక్ష్యం
- పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్
వేములవాడ, ఆంధ్రప్రభ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు వేగంగా పూర్తి అవుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ,పర్యావరణ, అటవీ శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి పరిశీలించారు. పనుల పురోగతి పై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనుల వద్ద ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు వేగంగా పూర్తి అవుతున్నాయని వివరించారు. ఇప్పటి వరకు 35 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. శృంగేరి పీఠాధిపతి సూచనలు, ఆగమ శాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. ఆలయ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు.. ఆలయ విస్తరణ అభివృద్ధిలో భాగంగా ఒక్కో పనికి ఒక్కో గడువు పెట్టుకొని ముందుకు పోతున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి, మంత్రుల సహకారంతో,శృంగేరి పీఠం వారి సూచనలకు అనుగుణంగా ముందుకు పోతున్నామన్నారు.
ప్రస్తుతం అనిమిటి మండపంలో భాగంగా అద్దాల మండపం,బ్రహ్మణ సత్రం, నిత్య అన్నదాన సత్రం,ఇతర పనులు వేగంగా జరుగుతున్నాయని, మరో 1000 సంవత్సరాల పాటు ఉండేలా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నమని, త్వరలోనే పనులు పూర్తి చేసి భక్తులకు మెరుగైన దర్శనం కల్పిస్తామన్నారు.. వేములవాడ పట్టణంతో పాటు రాజన్న ఆలయాన్ని సమపాళ్లలో అభివృద్ధి చేస్తామని తెలిపారు..47 కోట్లతో రోడ్డు విస్తరణ, ఆరు కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు.
రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు 20 కోట్లతో బద్ది పోచమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నాంపల్లి గుట్ట ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని అందులో భాగంగా ఇప్పటికే నాంపల్లి ఎయిర్ ఫోర్స్ విమానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో నాంపల్లి గుట్టను పర్యాటక రంగంలో తీర్చి దిద్దుతామని తెలిపారు. ఆద్యాత్మిక వాతావరణంలో సకల సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, భక్తుల మనోభావాలు, ఆగమ శాస్త్ర అనుగుణంగా రాజన్న ఆలయ నిర్మాణం చేపడుతున్నామన్నారు. అంతర ఆలయం అలాగే ఉంటుందని,రాజన్న ఆలయాన్ని అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి అభివృద్ధి చేస్తున్నామని, శిలలతో నిర్మాణం ఉంటుందని తెలిపారు.
సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ.. రాజన్న ఆలయ ఆలయ పనులు పరిశీలించడం జరిగిందన్నారు..వచ్చే ఏడాది ఆలయ విస్తరణ పనులు పూర్తి చేసి భక్తులకు స్వామి వారి దర్శనం కలిగేలా ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విప్ సూచనలతో అబివృద్ధి చేస్తున్నామన్నారు. మరిన్ని అభివృద్ధి పనులకు అంచనాలు రూపొందించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం భక్తులకు భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలు దర్శనాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, డీఎస్పీ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ లోకేష్, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.

