పోలీస్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్..
- వయోపరిమితి పెంపు..
ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్, రవాణా, అటవీ శాఖల్లో యూనిఫాం సర్వీసుల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి గరిష్ఠ వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్-ఏ) విభాగం జీవో ఎంఎస్ నంబర్ 122ను ఈరోజు (ఆగస్టు 14న) జారీ చేసింది.

ఇప్పటికే ప్రభుత్వం 2026 మే 18న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా యూనిఫాం సర్వీసుల పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని ఐదేళ్లు పెంచింది. తాజాగా మరో రెండేళ్లు పెంచడంతో మొత్తం ఏడు సంవత్సరాల వరకు వయో సడలింపు లభించనుంది. నిరుద్యోగ యువత నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం.. మరింత మంది అభ్యర్థులు నియామక ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
పోలీస్, ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్, రవాణా, అటవీ శాఖలకు సంబంధించిన ప్రత్యక్ష నియామకాల్లో ఈ వయోపరిమితి పెంపు వర్తించనుంది. తెలంగాణ గవర్నర్ ఆదేశాల మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ద్వారా సంక్రమించిన అధికారాలతో ఈ సవరణ చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
