కొత్త భవనం మంజూరు చేయాలి..

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి పట్టణానికి గిరిజన సంక్షేమ హైస్కూల్‌ను, ప్రస్తుతం కొనసాగుతున్న గిరిజన ఆశ్రమ పాఠశాలకు నూతన భవనాన్ని మంజూరు చేయాలని కోరుతూ ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ ప్రతినిధులు ఐటీడీఏ పీవో మంద మకరంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

శనివారం సాయంత్రం ఊట్కూరులో పీవోను కలిసిన సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిగ రవీందర్‌తో పాటు గడ్డం మణికుమార్, యాపల సమ్మయ్య, గొలిశెట్టి బాపు తదితరులు గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

బెల్లంపల్లి పట్టణంలోని వైటీసీలో కొనసాగుతున్న గిరిజన ఆశ్రమ పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో విద్యార్థులు ఇరుకు గదుల్లో చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. 2019లో కన్నాల జాతీయ రహదారి సమీపంలో ఐదు ఎకరాల స్థలాన్ని రెవెన్యూ శాఖ కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు భూమి స్వాధీన పత్రాలు అందలేదని పేర్కొన్నారు. ఆ భూమిని త్వరగా పాఠశాల నిర్మాణానికి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

అలాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు గిరిజన సంక్షేమ శాఖకు చెందిన హైస్కూల్ లేకపోవడంతో మారుమూల గ్రామాల గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే బెల్లంపల్లిలో గిరిజన సంక్షేమ హైస్కూల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

తమ వినతిపై ఐటీడీఏ పీవో సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో అరికిల్ల శంకర్, టేకం రాజయ్య, కోయ రాజం, ఊరటి పవన్ తదితరులు పాల్గొన్నారు.