వరంగల్ రైల్వే స్టేషన్‌లో బంగారు ఆభరణాలతో దొంగ అరెస్ట్

  • మార్కెట్ విలువ సుమారు రూ. 9.50 లక్షలు
  • వివరాలు వెల్లడించిన జీఆర్ పిసీఐ

కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ), ఆర్‌పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో రూ.9.50 లక్షల విలువైన 60.262 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.

జీఆర్పీ సీఐ పి. సురేందర్, ఆర్‌పీఎఫ్ సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం నంబర్లు 3, 4 వద్ద కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.

నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల మండలం కన్నాల గ్రామానికి చెందిన కేతేపల్లి హరీష్గా గుర్తించారు. అతని వద్ద నుంచి 60.262 గ్రాముల బంగారు గొలుసులు, బ్రాస్‌లెట్, చెవి ఆభరణాలు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.9.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

కరీంనగర్–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఆభరణాలను చోరీ చేసినట్లు నిందితుడు పంచుల సమక్షంలో ఒప్పుకున్నాడని, అనంతరం కేసు నమోదు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు సీఐ వెల్లడించారు.