మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి..

విద్యార్థులకు కీలక సూచనలు
డ్రగ్స్ అలవాటైతే భవిష్యత్తు నాశనం..
ఆదిత్య జూనియర్ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు

నరసాపురం, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నరసాపురం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఆదిత్య జూనియర్ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. రాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దని, వాటికి అలవాటు పడితే భవిష్యత్తును తామే నాశనం చేసుకున్న వారవుతారని హెచ్చరించారు.

డ్రగ్స్ వినియోగం వల్ల సమాజంలో అపఖ్యాతి పాలవడంతో పాటు తల్లిదండ్రుల గౌరవం కూడా దెబ్బతింటుందని పేర్కొన్నారు. యువత చదువుపై దృష్టి సారించి, భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. మంచి వ్యక్తిత్వంతో ఎదిగితే సమాజంలో గౌరవం లభించడంతో పాటు తల్లిదండ్రులకు కూడా కీర్తి తీసుకొస్తారని తెలిపారు.

చెడు స్నేహాలకు, మాదకద్రవ్యాలకు, సోషల్ మీడియా వ్యసనానికి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ తీసుకున్నా, విక్రయించినా లేదా అలాంటి ప్రదేశంలో ఉన్నా చట్టరీత్యా నేరమేనని, అలాంటి నేరాలకు కఠిన శిక్షలు ఉంటాయని, బెయిల్ కూడా సులభంగా లభించదని హెచ్చరించారు. డ్రగ్స్‌ను ప్రోత్సహించే వారి గురించి పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.

నరసాపురం టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆకుల రఘు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం, మహిళలను వేధించడం వంటి చర్యలు చట్టరీత్యా నేరమని అన్నారు. మత్తు పదార్థాల ప్రభావంలో వ్యక్తులు తమ చర్యలపై నియంత్రణ కోల్పోతారని, డ్రగ్స్ వాడుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం లేదా ఫిర్యాదుల కోసం డీ-అడిక్షన్ సెంటర్ టోల్‌ఫ్రీ నంబర్ 14446కు సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు.

అనంతరం విద్యార్థులతో “సే నో టు డ్రగ్స్.. సే యెస్ టు లైఫ్” అనే ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ వాసిరెడ్డి సాయివర ప్రసాద్, హైస్కూల్ ప్రిన్సిపల్ కర్ణ రాజేష్, అశోక్, బార్ అసోసియేషన్ కార్యదర్శి వి. సూర్యప్రకాశరావు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.డి. ఫణికర్, లీగల్ ఎయిడ్ కౌన్సెల్ ఆర్. పుల్లాజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.