వెల్గటూర్ మండలంలో విషాదం..
- ఒకే రోజు ఇద్దరు యువకుల మృతి…
వెల్గటూర్, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో ఒకే రోజు ఇద్దరు యువకులు వేర్వేరు కారణాలతో మృతి చెందడంతో ముత్తునూర్, రాజక్కపల్లి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని ముత్తునూర్ గ్రామానికి చెందిన మేడి ఆదర్శ్ (21) శుక్రవారం అంతర్గం మండలం కుక్కలగూడూర్ గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో మనస్తాపానికి గురై విషపూరిత పదార్థం (గడ్డి మందు) సేవించినట్లు తెలిసింది. ఇది గమనించిన బంధువులు వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు.
కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిషేధిత గడ్డి మందుల విక్రయాలను అరికట్టడంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరారు.
మరో ఘటనలో మండలంలోని రాజక్కపల్లి గ్రామానికి చెందిన గుమ్ముల సాయి మనోజ్ (23) హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ఆయన శనివారం ఇంటి నుంచి తాడు తీసుకెళ్లి మొక్కట్రావుపేట గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఉదయ్‌కుమార్ పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. ఒకే రోజు మండలంలోని రెండు గ్రామాల్లో ఇద్దరు యువకులు మృతి చెందడంతో ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
