భక్తుల సౌకర్యాలపై అధికారులకు కీలక ఆదేశాలు..

  • శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అమ్మవారిని దర్శించుకున్న దేవదాయశాఖ మంత్రి…
  • రూ. 60 కోట్లతో 297 గృహాల నిర్మాణం..
  • సదుపాయాలపై భక్తులతో అభిప్రాయాలను తెలుసుకుంటున్న మంత్రి…

నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శనివారం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న మంత్రికి రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, అర్చక స్వాములు, వేదపండితులు వేదాశీర్వచనం చేసి, శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

అనంతరం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను మంత్రి పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. దర్శన ఏర్పాట్లు, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం, క్యూ లైన్ల నిర్వహణ తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మంత్రి నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న సౌకర్యాలపై అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

అనంతరం సున్నిపెంటలో దేవస్థానం ఉద్యోగుల కోసం నిర్మించిన గృహాలను అధికారులతో కలిసి పరిశీలించారు. సుమారు రూ.60 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 297 గృహాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, త్వరలో దేవస్థానం ఉద్యోగులను ఈ గృహాలకు తరలిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రశేఖర అజాద్, దేవస్థానం అధికారులు తదితరులు పాల్గొన్నారు.