చివరి కోరిక వింటే కళ్లలో నీళ్లు తిరుగుతాయి..!
- అమెరికా పౌరసత్వానికి గుడ్‌బై..
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : విదేశాల్లో స్థిరపడి అమెరికా పౌరసత్వం పొందడం ఎంతోమందికి జీవిత లక్ష్యంగా భావిస్తారు. కానీ ఓ 94 ఏళ్ల వృద్ధురాలు తీసుకున్న నిర్ణయం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. అమెరికా పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుని, భారతీయురాలిగానే చివరి శ్వాస విడవాలనే కోరికతో భారత పౌరసత్వాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రగుంట మహాలక్ష్మమ్మ దరఖాస్తు చేశారు.
బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపాల గ్రామానికి చెందిన మహాలక్ష్మమ్మ… తన భర్త నాగభూషణం మరణించిన తర్వాత కుమారుడు, క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ కె.బుచ్చయ్య చౌదరి వద్ద ఉండేందుకు అమెరికాకు వెళ్లారు. 2000 జూలైలో అమెరికా పౌరసత్వం పొందిన ఆమె, దాదాపు రెండు దశాబ్దాల పాటు అక్కడే నివసించారు. అనంతరం 2018లో స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ఇక అప్పటి నుంచి ఇక్కడే తన ఉంటున్నారు.
తన జీవితంలోని చివరి క్షణాల్ని.. శేష జీవితాన్ని భారతదేశంలోనే గడపాలని, భారతీయురాలిగానే మరణించాలని నిర్ణయించుకున్నట్టు మహాలక్ష్మమ్మ తెలిపారు. ఈ మేరకే స్వచ్ఛందంగా అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని భారత పౌరసత్వ పునరుద్ధరణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదా ఉంది. ఈ దరఖాస్తుపై బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ సమక్షంలో విచారణ జరిగింది. అనంతరం అవసరమైన పత్రాలను అధికారులు పరిశీలించి, సంతకాలు తీసుకున్నారు. జిల్లా పరిపాలన నివేదికను కేంద్ర హోంశాఖకు పంపింది. తుది నిర్ణయం కేంద్ర హోంశాఖ తీసుకోనుంది.
ఈ సందర్భంగా… మహాలక్ష్మమ్మ తన మిగిలిన జీవితాన్ని తన స్వదేశంలో గడపాలని, చివరి సంస్కారాలు కూడా భారతదేశంలోనే జరగాలని కోరుకున్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటన అక్కడున్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసిందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు.
