ఎమర్జెన్సీ యోధులకు ఘన సన్మానం

చెన్నూర్ ఆంధ్రప్రభ: 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ కాలంలో జైలు శిక్ష అనుభవించిన యోధులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ నాయకులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెన్నూర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు బెల్లంకొండ మల్లారెడ్డి, మార్కాపూరి వెంకయ్య ఎమర్జెన్సీ సమయంలో అరెస్టై జైలు జీవితం గడిపారని తెలిపారు. ఎమర్జెన్సీ అమలై 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చెన్నూర్ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించినట్లు పేర్కొన్నారు.

మంచిర్యాల శిశుమందిర్‌లో ఆచార్యుడిగా పనిచేస్తున్న బెల్లంకొండ మల్లారెడ్డిని అర్ధరాత్రి కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారని గుర్తుచేశారు. అదే విధంగా మార్కాపూరి వెంకయ్యను అరెస్టు చేసి బెల్లంపల్లి వరకు తరలించి అనంతరం విడుదల చేసినప్పటికీ, ఎమర్జెన్సీ ముగిసే వరకు పోలీసులు ఆయనను నిరంతరం వేధించారని తెలిపారు. ఈ ప్రాంతం నుంచి ఎమర్జెన్సీ సమయంలో అనేక కష్టనష్టాలు భరించిన వారిలో వీరిద్దరూ ముఖ్యులని పేర్కొన్నారు. వారితో పాటు సాధారణ ప్రజలు, పాత్రికేయులు, ప్రతిపక్ష నాయకులు కూడా జైలు జీవితం గడుపుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారని అన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వారు చూపిన ధైర్యసాహసాలు, త్యాగాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ ఆదర్శమని నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రత్న లక్ష్మీనారాయణ రెడ్డి, సీనియర్ నాయకుడు కొండపాక చారి, చెన్నూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి కాగిత వెంకటేష్, బానికరావు శంకర్, పట్టణ కౌన్సిలర్ నేతం శివకృష్ణ, బీఎల్‌ఏ-1 జాడి తిరుపతి, బీజేపీ నాయకులు తగరం మధురాజ్, ఆడప శ్రీనివాస్, పున్నం లక్ష్మా గౌడ్, కొత్తూరి దుర్గాప్రసాద్, ఎడ్ల స్వరూపరాణి, ముత్యాల శ్రావణి తదితరులు పాల్గొన్నారు.