రైతులు, మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

  • రూ.21.31 కోట్ల రుణాల పంపిణీ చేసిన కేడీసీసీబీ

మైలవరం, ఆంధ్రప్రభ: రైతులు, మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మైలవరంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) చైర్మన్ నెట్టెం రఘురాంతో కలిసి రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు పంట రుణాలు అందించడం ద్వారా వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మొత్తం రూ.21.31 కోట్ల రుణాలు పంపిణీ చేయగా, మైలవరం బ్రాంచ్‌కు రూ.11.93 కోట్లు, జి.కొండూరు బ్రాంచ్‌కు రూ.4.51 కోట్లు, ఇబ్రహీంపట్నం బ్రాంచ్‌కు రూ.3.50 కోట్లు, కొత్తూరు తాడేపల్లి బ్రాంచ్‌కు రూ.62 లక్షలు, భవానిపురం బ్రాంచ్‌కు రూ.75 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు.

రైతులు సకాలంలో రుణాలను వినియోగించి వ్యవసాయోత్పత్తిని పెంచుకోవాలని, మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక సహకారం అందించడం ద్వారా వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు.

సహకార రంగం బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రైతులు మరియు మహిళలకు అవసరమైన ప్రతి విధమైన సహకారం అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ పరిధిలోని ఐదు బ్రాంచీల ద్వారా మొత్తం 28 సహకార సంఘాలకు రుణాలు మంజూరు చేశామని, వాటిలో 27 సంఘాలు లాభాల్లో ఉన్నాయని తెలిపారు.

మైలవరం నియోజకవర్గ పరిధిలోని కేడీసీసీబీ ఐదు ప్రధాన బ్రాంచీలలో 2026 మే 31 నాటికి మొత్తం రూ.319.59 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. అలాగే ఈ బ్రాంచీల ద్వారా మొత్తం రూ.723.25 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ, 2026 మే 31 నాటికి జిల్లాలో మొత్తం రూ.12,596.92 కోట్ల వ్యాపారం నమోదైందన్నారు. ఇందులో రూ.3,981.13 కోట్ల డిపాజిట్లు, రూ.8,615.78 కోట్ల రుణాలు ఉన్నట్లు తెలిపారు. రైతులు, మహిళల ఆర్థిక పురోగతికి సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి అక్కల రామ్మోహన్‌రావు (గాంధీ), కూటమి నాయకులు, సహకార శాఖ అధికారులు, బ్యాంకు ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, రైతులు, డ్వాక్రా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.