పల్స్ పోలియో విజయానికి సమష్టి కృషి అవసరం
- జూన్ 28 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమం
మైలవరం, ఆంధ్రప్రభ: ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సభా మందిరంలో తహసీల్దార్ అబ్దుల్ ధరియా, సీడీపీఓ కె. పుష్పలత, డాక్టర్ యోచన, అంగన్‌వాడీ సిబ్బందితో కలిసి పల్స్ పోలియో గోడపత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ, పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు వయస్సు గల ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మైలవరం మండలంలో మొత్తం 4,497 మంది ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించినట్లు వెల్లడించారు. వారి కోసం మండల వ్యాప్తంగా 38 పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదనంగా బస్‌స్టాండ్‌లో ఒక ప్రత్యేక బూత్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, ఒక హైరిస్క్ ప్రాంతాన్ని గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు తమ చిన్నారులను సమీప పోలియో బూత్‌లకు తీసుకువచ్చి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. అలాగే పిల్లలను తీసుకువచ్చే సమయంలో మొబైల్ ఫోన్ వెంట తీసుకురావాలని సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తల్లిదండ్రులు స్వచ్ఛందంగా సహకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డాక్టర్ ప్రియాంక పిలుపునిచ్చారు.
