పాస్‌పోర్ట్ ఛార్జీలు పెంచిన కేంద్రం

  • జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమలు

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: విదేశీ ప్రయాణాలు, ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం పాస్‌పోర్ట్ తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పాస్‌పోర్ట్ సేవల ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త ఛార్జీలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

కొత్త నిర్ణయం ప్రకారం 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఛార్జీ రూ.1,500 నుంచి రూ.2,500కు పెంచారు. అలాగే 60 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఛార్జీ రూ.2,000 నుంచి రూ.3,500కు పెంచినట్లు వెల్లడించారు.

అత్యవసరంగా పాస్‌పోర్ట్ పొందాలనుకునే వారి కోసం అందించే తాత్కాల్ సేవల ఫీజులను కూడా సవరించారు. 36 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్ ఛార్జీ రూ.5,000కు, 60 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్ ఛార్జీ రూ.6,000కు పెంచినట్లు పేర్కొన్నారు.

పాస్‌పోర్ట్ సేవల నిర్వహణ వ్యయం, సాంకేతిక సేవల విస్తరణ, భద్రతా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త ఫీజుల కారణంగా విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగార్థులు, ప్రయాణికులపై అదనపు భారం పడనుంది.