పారదర్శకంగా ఖచ్చితత్వంతో ఓటర్ల జాబితా ఉండాలి
- జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ఆంధ్రప్రభ బ్యూరో, శ్రీకాకుళం: పారదర్శకంగా అత్యంత ఖచ్చిత్వంతో ఓటర్ల జాబితా అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) – 2026 (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026) ప్రక్రియ పై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్ తో కలసి గురువారం ఆయన ఈ ఆర్వోలతో సమావేశం నిర్వహించారు.
సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. సర్ ప్రక్రియకు సన్నద్ధత, అధికారులు, సిబ్బందికి శిక్షణ, రాజకీయ పార్టీలతో సమావేశాలు, ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) జనరేషన్, ప్రింటింగ్, ఈఎఫ్‌ల అందజేత, బీఎల్‌వో కిట్లు, తదితర అంశాలపై చర్చించారు. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ, ఓటర్ల మ్యాపింగ్ ప్రతి విషయం గురించి తెలియజేశారు.
జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్‌వోల ద్వారా ఇంటింటి సర్వే లో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, బీఎల్‌వోల పనితీరుపై చర్చించారు. జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ల స్వీకరణ ఆ తర్వాత వీటిని పరిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న తుది జాబితాను ప్రచురించడం వరకు ప్రతి కార్యక్రమం సకాలంలో పూర్తి చేసేందుకు సన్నద్ధతతో ఉండాలని ఆదేశించారు.
అర్హులను ఓటరు జాబితాలో ఉండేలా చేయడంతోపాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉండటం వంటి వారి ఓట్లను తొలగించి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా లక్ష్యంగా సర్ ప్రక్రియ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి పారదర్శకతకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) తప్పనిసరిగా ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ సమగ్ర సవరణ ప్రక్రియను గడువులోగా, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పూర్తి చేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.
ఈ ప్రక్రియను పరిమితమైన కాలవ్యవధితో పూర్తిచేయాల్సి ఉన్నందున అధికారులు, సిబ్బంది పూర్తి సమర్థతతో, బాధ్యతాయుతంగా పనిచేసి నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి చిన్న పొరపాట్లకు తావు లేకుండా, అత్యంత కచ్చితత్వంతో ఈ ప్రక్రియను నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య, జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఈఆర్ఓలు పద్మావతి, జి. జయదేవి, లక్ష్మణమూర్తి, లావణ్య, ఆర్డీఓలు కె. సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్. కూర్మారావు, జడ్పీ సిఈఓ వెంకటరామన్, ఎలక్షన్ డిటీలు, తదితరులు పాల్గొన్నారు.
