చిత్రావతి నది పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి

  • మాజీ మంత్రి పల్లె

శ్రీ సత్య సాయి బ్యూరో , ఆంధ్రప్రభ: పుట్టపర్తి పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం పుట్టపర్తి చిత్రావతి రోడ్డుతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో జరుగుతున్న సుందరీకరణ పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన పూల మొక్కలను పరిశీలించిన ఆయన, వాటికి క్రమం తప్పకుండా నీరు అందించి సంరక్షించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పచ్చదనంతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే పుట్టపర్తి పట్టణానికి మరింత శోభ చేకూరుతుందని పేర్కొన్నారు.

చిత్రావతి నదిలో పేరుకుపోయిన చెత్తాచెదారం, పారిశుధ్య వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. నదీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా స్థానికులతో పాటు పుట్టపర్తికి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించవచ్చని తెలిపారు.

అలాగే ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. పుట్టపర్తి ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన పట్టణమని, పరిశుభ్రత, పచ్చదనం, సుందరీకరణ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ “సుందర పుట్టపర్తి”గా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సూచించారు.