ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు హెల్ప్ డెస్క్ ప్రారంభం..

  • ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్ సంధ్యారాణి,

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ఓటర్లకు మెరుగైన సేవలు అందించేందుకు నర్సంపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను గురువారం ప్రారంభించారు.

ఈ హెల్ప్ డెస్క్‌ను వరంగల్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి ప్రారంభించి, కార్యక్రమ నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకోవడం అవసరమని అన్నారు.

ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు. హెల్ప్ డెస్క్ ద్వారా ఓటరు నమోదు, పేరు, చిరునామా మార్పులు, వివరాల సవరణలు, మరణించిన లేదా వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు వంటి సేవలను సులభతరం చేసినట్లు తెలిపారు.

18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న యువతీ యువకులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఓటరు గుర్తింపు కార్డుకు సంబంధించిన సందేహాలు, దరఖాస్తుల స్థితి, అవసరమైన పత్రాల వివరాలపై కూడా మార్గదర్శకత్వం అందించనున్నట్లు చెప్పారు.

రెవెన్యూ డివిజనల్ అధికారి ఉమారాణి మాట్లాడుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు నమోదు అయ్యేలా అధికారులు, బీఎల్‌వోలు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

తహసీల్దార్ మాట్లాడుతూ, హెల్ప్ డెస్క్ ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఓటరు జాబితాకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా హెల్ప్ డెస్క్‌ను సంప్రదించి పరిష్కారం పొందవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఉమారాణి, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ శాఖ సిబ్బంది, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.