ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి

  • డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క కోరారు.

గురువారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలను పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా చూడాలని బీఎల్ఏలకు, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడికి ఆ హక్కు అందేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆమె అన్నారు.

ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, సవరణల ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ డీసీసీ కార్యవర్గ సభ్యులు సుద్దాల శ్రీనివాస్, సిర్పూర్ (యు) మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆత్రం శంకర్, సర్పంచులు పెందూర్ గణపత్ రావు, మడావి లక్ష్మణ్, కొట్నాక్ బాపూజీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు.