పదవి విరమణ చేశానే గానీ, పెదవి విరమణ చేయలేదు..

  • కాకతీయ కమ్మ సేవా సమితి కళ్యాణ మండపం ప్రారంభంలో
  • మాజీ ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు.

కోదాడ, ఆంధ్రప్రభ : కోదాడ పట్టణంలోని దుర్గాపురం వై జంక్షన్ వద్ద కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం ఘనంగా ప్రారంభించారు. కోదాడకు చేరుకున్న ఆయనకు సమితి నాయకులు, సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, తాను పదవి విరమణ చేశానే గానీ పెదవి విరమణ చేయలేదని వ్యాఖ్యానించి సభికులను ఆకట్టుకున్నారు. తాను సంపాదించిన జ్ఞానాన్ని యువతరానికి అందించేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నానని తెలిపారు. మంచి పనులు చేయడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

“సర్వేజనాః సుఖినో భవంతు” అనే భావనతో సమాజం వసుధైక కుటుంబంగా ఉండాలని ఆకాంక్షించారు. సంపదకు మనం ధర్మకర్తలమని, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే పనినే ధర్మమని చెప్పారు. ఇష్టపడి, కష్టపడి పని చేస్తే ఎవరూ నష్టపోరని యతిప్రాసలతో ప్రసంగాన్ని రంజింపజేశారు.

ఆవు, చెట్టు పరులకు ఉపకారం కోసం జీవిస్తాయని, మనుషులు కూడా సేవా భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రకృతిని ప్రేమించి కాపాడాలని, ప్రస్తుతం ప్రకృతి పరితపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. “నేచర్ అండ్ కల్చర్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్” అనే సందేశాన్ని అందించారు.

కులం ఉండవచ్చని, కానీ కులపిచ్చి ఉండకూడదని స్పష్టం చేశారు. సేవా భావంతో అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తాను న్యాయవాదిగా మారాలనుకున్నప్పటికీ, అత్యవసర పరిస్థితుల ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తన బాల్య జీవితంలోని పలు సంఘటనలను సభికులతో పంచుకున్నారు.

రాజకీయాల్లో ఉన్నవారు తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలని వెంకయ్య నాయుడు సూచించారు. ఆ కోవకు చెందిన నాయకుడిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ప్రశంసించారు. కళ్యాణ మండప నిర్మాణానికి విరాళాలు అందించిన దాతలను అభినందించిన ఆయన, సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రశంసించారు. అనంతరం కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నగదు పురస్కారాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మాజీ మంత్రి వీరేపల్లి లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, రావెళ్ల సీతారామయ్య, సంఘం కోదాడ అధ్యక్షుడు పెదనాటి వెంకటేశ్వరరావు, కార్యదర్శి వేమూరి సురేష్, కోశాధికారి పోటు రంగారావు, ఉపాధ్యక్షుడు మార్తి మాధవరావు, సంయుక్త కార్యదర్శి కనగాల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్దన్‌రావు, మాజీ ఎమ్మెల్యే కోటేశ్వరరావు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, కమ్మ సేవా సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డు రవిశంకర్, కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి రత్నాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.