విధుల్లో నిర్లక్ష్యం..

విధుల్లో నిర్లక్ష్యం..

నలుగురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు

వేతనాల నిలుపుదలకు ఆదేశాలు..
కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్న డీఎల్‌డీవో

పల్నాడు ప్రతినిధి, జూన్ 25 (ఆంధ్రప్రభ): పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం రవ్వారం గ్రామ సచివాలయంలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నలుగురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారి వేతనాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారంలో సచివాలయ సిబ్బంది అలసత్వంగా వ్యవహరిస్తున్నారంటూ గ్రామస్థులు గత నెల రోజులుగా పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. దీనిపై వెంటనే విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ డీఎల్‌డీవో వెంకటరెడ్డిని ఆదేశించారు.

ఆదేశాల మేరకు వెంకటరెడ్డి రవ్వారం గ్రామంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించగా, పలువురు సచివాలయ సిబ్బంది విధుల్లో లేకపోవడం గుర్తించారు. విచారణలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం జరిగినట్లు తేలడంతో గ్రామ సంక్షేమ కార్యదర్శి, మహిళా పోలీసు, సర్వేయర్, ఏఎన్‌ఎంలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ఆయా నలుగురు సిబ్బంది వేతనాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెంకటరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.