Crime Action | ఈసారి బిగ్‌స్క్రీన్‌పై!

Crime Action | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: ఓటీటీలో సంచలన విజయం సాధించిన క్రైమ్‌ యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌ ‘మిర్జాపూర్‌’ ఇప్పుడు థియేటర్లలో సందడి చేయనుంది. ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ఫ్రాంచైజీ నుంచి ‘మిర్జాపూర్‌: ది మూవీ’ పేరుతో చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను నేడు విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఈ టీజర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఓటీటీలో విశేష ఆదరణ పొందిన మిర్జాపూర్‌ కథను ఇప్పుడు వెండితెరపై ఎలా ఆవిష్కరిస్తారోననే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

టీజర్‌లో మిర్జాపూర్‌కు గుర్తింపుగా నిలిచిన యాక్షన్, పవర్ పాలిటిక్స్, ఆధిపత్య పోరాటం, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్‌లను చూపిస్తూ సినిమా మరింత గ్రాండ్‌గా తెరకెక్కినట్లు సంకేతాలు ఇచ్చారు. వెబ్ సిరీస్‌లో ప్రేక్షకులను అలరించిన కీలక పాత్రలు మరోసారి కనిపించనున్నాయి. మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ‘మిర్జాపూర్: ది మూవీ’ 2026 సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

హిందీతో పాటు తెలుగు భాషలో కూడా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో దక్షిణాది ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఓటీటీలో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించిన ‘మిర్జాపూర్’ ఇప్పుడు థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తుండగా, సినిమా విడుదలపై ఇప్పటికే చర్చ మొదలైంది.