ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందజేసిన కొరివి వెంకన్న
చిట్యాల, జూన్ 25 (ఆంధ్రప్రభ): విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రముఖ వ్యాపారవేత్త, సమాజసేవకుడు కొరివి వెంకన్న పిలుపునిచ్చారు. చిట్యాల పురపాలక పరిధిలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయురాలు బోడ సుశీల అధ్యక్షతన పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా కొరివి వెంకన్న మాట్లాడుతూ, క్రమశిక్షణతో కష్టపడి చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ విజయం వారి బాధ్యతను మరింత పెంచిందని, ఇదే పట్టుదలతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ప్రధానోపాధ్యాయురాలు బోడ సుశీల మాట్లాడుతూ, విద్యార్థులు తమ స్వయంకృషితో సంపాదించిన ఈ పురస్కారాలు ఎంతో విలువైనవని అన్నారు. నగదు బహుమతులను వృథా చేయకుండా చదువుకు అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేయడానికి లేదా జ్ఞానాన్ని పెంపొందించే పనులకు వినియోగించాలని సూచించారు. ఆత్మవిశ్వాసంతో నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని విద్యార్థులకు హితవు పలికారు.
పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన గండవరం సంకీర్తనకు రూ.20 వేల నగదు బహుమతి, ద్వితీయ స్థానం పొందిన ఎం.డి. షాహిన్‌కు రూ.15 వేల నగదు బహుమతి, తృతీయ స్థానం సాధించిన మంద శ్రీవాణికి రూ.10 వేల నగదు బహుమతిని అందజేసి సత్కరించారు. అనంతరం విద్యార్థులను ప్రోత్సహించిన కొరివి వెంకన్నను పాఠశాల యాజమాన్యం శాలువాతో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు బూరుగు కృష్ణయ్య, పాలాది రమేష్, ఉపాధ్యాయులు చిలకరాజు శ్రీనివాస్, ఏ. పద్మజ, కోణం శ్రీనివాస్, జి. ఇందిర, ఏ. కవిత, ఎన్. సైదులు, సీహెచ్. ప్రసన్న, జి. శైలజ, ఎం.డి. సాదిక్, ఎం. జానకి, ఎం. సౌమ్య, ఎస్. ప్రవీణ, డి. కుసుమ తదితరులు పాల్గొన్నారు.
