ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
- కలెక్టర్ చాహత్ బాజ్పాయి
హనుమకొండ, ఆంధ్రప్రభ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి అధికారులను ఆదేశించారు.
గురువారం హనుమకొండ పట్టణంలోని చైతన్యపురి ప్రాంతంలో బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్వోలు ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు.
ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పని చేయాలని అన్నారు.
ఓటర్ల నుంచి అందిన ఫారాలను నిర్ణీత గడువులోగా స్వీకరించి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని సరైన సమాచారం అందించాలని కోరారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే కీలక ప్రక్రియ అని పేర్కొన్న కలెక్టర్, అధికారులు, బీఎల్వోలు పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, సంబంధిత సిబ్బంది, బీఎల్వోలు పాల్గొన్నారు.
