3-Teachers-Suspended : గురుకులంలో మందులాట Andhra Prabha Crime Story
3-Teachers-Suspended : గురుకులంలో మందులాట Andhra Prabha Crime Story
- విద్యార్థులు మద్యం గటగట
- ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు
- .విచారణలో నిర్లక్ష్యం
- ప్రోత్సాహం ఉన్నట్లు నిర్ధారణ.
- . క్రమశిక్షణ లోపం..
- అధికారుల కఠిన నిర్ణయం.
( కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ):
3-Teachers-Suspended : విద్యార్థుల చేత మద్యం సేవనం, ధూమపానం ఘటన వెలుగులోకి రావడంతో అరికెర గురుకుల పాఠశాలలో పరిపాలనా వైఫల్యాలు బహిర్గతమయ్యాయి. జిల్లా అధికారుల విచారణలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, ప్రోత్సాహం ఉన్నట్లు తేలడంతో ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయగా, ఇప్పటికే ప్రిన్సిపల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్ కొనసాగుతుండటం విద్యావర్గాల్లో చర్చనీయాంశమైంది.
కర్నూలు జిల్లా అరికెర గురుకుల పాఠశాలలో విద్యార్థులు మద్యం సేవించడం, ధూమపానం చేయడం వంటి ఘటన తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు పాఠశాల వైస్ ప్రిన్సిపల్ తెలిపారు.
స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు జిల్లా స్థాయి అధికారులు సమగ్ర విచారణ నిర్వహించారు. విద్యార్థుల అనుచిత ప్రవర్తనను అరికట్టడంలో కొంతమంది ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించడమే కాకుండా పరోక్షంగా ప్రోత్సహించినట్లు విచారణలో తేలినందున వారిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు వెల్లడించారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గురుకుల పాఠశాలల్లో క్రమశిక్షణ, పర్యవేక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
కాగా, ఇదే విద్యాసంస్థలో విధులు నిర్వహించిన ప్రిన్సిపల్‌పై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన కూడా సస్పెండ్ కావడం గమనార్హం. వరుస వివాదాలతో అరికెర గురుకుల పాఠశాల మరోసారి వార్తల్లో నిలవడం చర్చనీయాంశంగా మారింది.
