అర్ధరాత్రి మహిళపై దాడి..

అర్ధరాత్రి మహిళపై దాడి..

ఐదు తులాల బంగారు గొలుసు అపహరణ

గంటల వ్యవధిలోనే నిందితుడి అరెస్టు..
చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు

నిజామాబాద్ క్రైమ్, జూన్ 25 (ఆంధ్రప్రభ): నిజామాబాద్ నగరంలోని ఎఫ్‌సీఐ కాలనీలో అర్ధరాత్రి వేళ ఓ మహిళపై దాడి చేసి ఐదు తులాల బంగారు గొలుసును అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై వెంటనే స్పందించిన నాల్గవ టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి అనంతరం సుమారు 2.30 గంటల సమయంలో ఎఫ్‌సీఐ కాలనీలోని సాయి నివాస్, స్ట్రీట్ నంబర్-3లో నివసిస్తున్న ఓ మహిళ అత్యవసర పనిమీద ఇంటి బయటకు వచ్చింది. ఇదే సమయంలో అక్కడ మాటు వేసి ఉన్న ఓ దుండగుడు ఆమెపై అకస్మాత్తుగా దాడి చేశాడు. మహిళ తేరుకునేలోపే ఆమె మెడలో ఉన్న ఐదు తులాల బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు.

బాధితురాలు వెంటనే కుటుంబ సభ్యులకు, అనంతరం పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న నిజామాబాద్ నాల్గవ టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాల సహాయంతో నిందితుడిని గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి చోరీకి గురైన ఐదు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఘటన జరిగిన వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులను కాలనీవాసులు అభినందించారు. అయితే, అర్ధరాత్రి సమయంలో సొంతింటి ఆవరణలోనే ఈ ఘటన జరగడం స్థానికుల్లో భద్రతపై ఆందోళనకు కారణమైంది.