18months baby | హృదయవిదారక ఘటన

నిమిషాల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అప్పటి వరకు ఇంటి వద్ద ఆడుకుంటున్న ప్రియాన్షి (18 నెలలు) అనే చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది.

చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, నీటి సంపులో ఆమె మృతదేహం కనిపించింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

తన కళ్ల ముందే పెరిగిన మనవరాలు మృతి చెందిన విషయం తెలుసుకున్న నానమ్మ మారబోయిన నాగమ్మ (65) తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందినట్లు సమాచారం.

నిమిషాల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన చిన్నారి, నానమ్మ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిందా లేదా అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు.