Pawankalyan | పవన్, సూరి మూవీ ఆగిపోయిందా..?

Pawankalyan | పవన్, సూరి మూవీ ఆగిపోయిందా..?

సురేంద్రరెడ్డికి సినిమా కష్టాలు..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. ఒకప్పుడు భారీ, క్రేజీ సినిమాలు తెరకెక్కించాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. అయితే.. అక్కినేని అఖిల్ తో సురేందర్ రెడ్డి ఏజెంట్ అనే సినిమా తీయడం.. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవ్వడం తెలిసిందే. ఈ మూవీ రిలీజై మూడేళ్లు దాటింది కానీ.. ఇంత వరుకు సురేందర్ రెడ్డి కొత్త సినిమా స్టార్ట్ కాలేదు. పవర్ స్టార్ తో మూవీని అనౌన్స్ చేసాడు కానీ.. ఎలాంటి అప్ డేట్ లేదు. అసలు పవన్, సూరి మూవీ ఉందా..? లేదా..?

ఎన్నాళ్ల నుంచో వెయిటింగ్..
సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కలిసి పవర్ స్టార్ కి ఎప్పుడో ఓ కథ చెప్పారు. ఆ కథ విని ఓకే చెప్పిన పవర్ స్టార్ ఆతర్వాత రాజకీయాల్లో బిజీగా ఉండడం వలన ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. పవన్ ఒప్పుకున్న వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు పూర్తి చేసారు కానీ.. సురేందర్ రెడ్డితో చేస్తానని మాట ఇచ్చిన సినిమాని ఇంత వరుకు పట్టాలెక్కించలేదు. ఈమధ్య కాలంలో ఈ సినిమాని స్టార్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో ఎన్నాళ్ల నుంచో వెయిటింగ్లో ఉన్న ఈ మూవీ స్టార్ట్ కానుందని వార్తలు అయితే వచ్చాయి కానీ.. షూటింగ్ అయితే స్టార్ట్ కాలేదు.

త్వరలో సెట్స్ పైకి ఓజీ సీక్వెల్..?
ఇప్పుడు ఓజీ సీక్వెల్ కి సంబంధించి అప్ డేట్ రావడంతో.. సురేందర్ రెడ్డితో సినిమా ఉందా..? లేదా..? అనేది సస్పెన్స్ గా మారింది. ఓజీ మూవీ పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో ఓజీ సీక్వెల్ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. పవర్ స్టార్ ఇటీవల ఓజీ డైరెక్టర్ సుజిత్ తో కథాచర్చలు జరిపారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా పై పవన్ ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో.. ఈ క్రేజీ సీక్వెల్ ను త్వరలోనే స్టార్ట్ చేయనున్నారని ప్రచారం మొదలైంది.

సూరికి కాలం కలిసి రావడం లేదు..
సురేందర్ రెడ్డి.. ఏజెంట్ సినిమా ప్లాప్ తర్వాత వెంకటేష్ తో సినిమా చేయాలని ట్రై చేశారు కానీ.. కుదరలేదు. ఆతర్వాత రవితేజతో సినిమా చేయాలని కథ రెడీ చేసారు. తీరా రవితేజతో సినిమా చేద్దామనుకునే లోపు పవన్ డేట్స్ ఇస్తాను అనడంతో మళ్లీ పవన్ దగ్గరకు వచ్చారు. అయితే.. పవన్ కు చెప్పిన కథ పూర్తి స్థాయిలో నచ్చలేదట. అందుకనే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని టాక్ వినిపిస్తోంది.. మరో వైపు స్టార్ అండ్ యంగ్ హీరోలు ఎవరూ ఖాళీగా లేరు. ఆమధ్య కోలీవుడ్ స్టార్ విక్రమ్ తో సినిమా చేయాలని కూడా ట్రై చేసారట సూరి. ఆ ప్రాజెక్ట్ కూడా సెట్ కాలేదు. ఇలా.. సురేందర్ రెడ్డి సినిమా చేయాలని తపిస్తున్నాడు కానీ.. సెట్ కావడం లేదు. మరి.. పవన్ తో చేయాలి అనుకున్న మూవీ సెట్ అవుతుందో.. లేక వేరే హీరోతో సినిమా చేస్తారో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.