Pakistan Crisis | పాకిస్తాన్ భవిష్యత్తుపై పెరుగుతున్న అనిశ్చితి

Pakistan Crisis | పాకిస్తాన్ భవిష్యత్తుపై పెరుగుతున్న అనిశ్చితి

Pakistan Crisis | పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పెరుగుతున్న అసంతృప్తి
బలూచిస్తాన్, సింధ్ ప్రాంతాల్లో తిరుగుబాటు స్వరాలు
పొరుగు దేశాల రాజకీయ వైఖరిపై విశ్లేషణ
ఉగ్రవాద విధానాల వల్ల పాక్‌కు ఎదురైన సంక్షోభం

Pakistan Crisis | దేశ విభజన జరిగి, మతపరంగా ఏర్పడిన పాకిస్తాన్ అప్పట్లో భారత్కు చెందిన భూభాగాన్ని ఆక్రమించుకుని, ఉగ్రవాదాన్ని నమ్ముకుని భారతాన్ని పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నది. పాక్ ఆక్రమిత కాశ్మీరు భారత్ తన అంతర్భాగంగానే పేర్కొంటూ, ఆ భూభాగాలను తనకు అప్పగించాలని కోరుకుంటున్నది.

అజాద్ కాశ్మీర్, గిల్గిట్-బాల్టిస్తాన్లు పాక్ నియంత్రణలో కొనసాగుతున్న స్వయంపాలిత ప్రాంతాలు. పేరుకు మాత్రం పి.ఓ.కెను స్వయంపాలిత భూభాగంగా పేర్కొంటున్నా, సుమారు 60 లక్షల జనాభా గల ఆ ప్రాంత ప్రజల సంపదను ఇస్లామాబాద్ దోచుకోవడం, పి.ఓ.కె ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా భావించడం, వారి ఆస్తులను లాక్కోవడం వలన ప్రజల్లో నిరసన సెగలు వ్యాపించాయి. పాక్ నుంచి స్వాతంత్ర్యం కావాలని, ఇండియాలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

భారత్ అధీనంలో గల జమ్మూ కాశ్మీర్లో రోడ్డు రవాణా సౌకర్యాలు పెరిగి, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంటే, పి.ఓ.కె పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. సుమారు పి.ఓ.కెలో ప్రధాని, అధ్యక్షుడున్నా కీలకమైన అధికారాలన్నీ ఇస్లామాబాద్ పాలకుల చేతుల్లోనే ఉన్నాయి. పాక్‌పై తిరగబడుతున్న ప్రజలపై పాక్ ప్రభుత్వం కాల్పులు జరుపుతూ, నిర్దాక్షిణ్యంగా చంపడం అత్యంత హేయమైన చర్య. పాక్‌లోని వివిధ ప్రాంతాలు విభజన దిశగా అడుగులు వేస్తున్నాయి.

అన్నవస్త్రాలకు పాకులాడితే ఉన్న వస్త్రాలు కూడా ఊడినట్టు, తనది కాని కాశ్మీర్ కోసం గత 78 సంవత్సరాల నుంచి భారత్తో పోరాడుతున్న పాకిస్తాన్ తన ఆధీనంలోని కాశ్మీర్‌తో సహా, బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్సులను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్, మాల్దీవులు, శ్రీలంక భారతదేశానికి పొరుగునున్న దేశాలు. మనకు దూరంగా ఉన్న దేశాలతో ప్రమాదం లేకపోవచ్చు. కానీ, మన పొరుగు దేశాలు సక్రమంగా లేకపోతే ఎంత ప్రమాదకరమో భారత్కు పొరుగునున్న చైనా, పాక్, బంగ్లాదేశ్ నిర్వాకం చూస్తే అవగతం కాగలదు.

భారతాన్ని నాశనం చేయడమే పాకిస్తాన్ ఏకసూత్ర కార్యక్రమంగా పెట్టుకుని ఉగ్రవాదులతో కలిసి పని చేస్తున్నది. భూటాన్ భారత్కు విశ్వసనీయమైన దేశం అయినా, భారత్, భూటాన్, చైనాల మధ్యనున్న ట్రైజంక్షన్ “డోక్లాం” విషయంలో చైనా భారతాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నది.

భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను కలిపే చికెన్ నెక్ ప్రాంతంలో చైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఇక పొరుగునున్న నేపాల్ భారత్ ఆర్థిక సహాయం పొందుతూ, ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మార్చుకుంటూ ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ, ఒక్కోసారి భారత్కు అనుకూలంగా, మరోసారి వ్యతిరేకంగా మారుతున్న విషయాన్ని గ్రహించాలి. నేపాల్‌ను కూడా పూర్తిగా విశ్వసించలేము.

శ్రీలంక కూడా అదే పంథా అనుసరించింది. మాల్దీవులతో భారత్‌కు కొంతకాలం సఖ్యత దెబ్బతిన్నది. మాల్దీవుల్లో భారత్ సైన్యాన్ని వెనక్కి పంపి, చైనాతో స్నేహం చేస్తున్న ఆ దేశ అధ్యక్షుడు మొహ్మద్ మయిజ్జు తిరిగి భారత్ సాయం కోసం ప్రాకులాడడం విడ్డూరంగా ఉంది. పాక్ స్వతంత్ర దేశంగా అవతరించినా భారత్‌పై నిరంతరం కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. మన పొరుగునున్న దేశాలు భారత్ చేసిన సాయాన్ని మరచి మన శత్రుదేశంతో స్నేహం చేస్తూ ఆర్థికంగా పతనమైపోయాయి. ప్రజల ఛీత్కారానికి, ఆగ్రహానికి గురయ్యాయి.

బంగ్లాదేశ్ విమోచనంలో మనమెంత సహాయపడినా బంగ్లాదేశ్ మనపై విషం చిమ్ముతూనే ఉంది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి భారత్ చేసిన సహాయానికి ప్రతిఫలంగా బంగ్లా ప్రభుత్వం అక్కడ మైనారిటీ ప్రజల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆక్షేపణీయం. బంగ్లాదేశ్ అభివృద్ధికి బాటలు వేసిన భారత్పై పాక్‌తో కలిసి కుట్రలు చేస్తున్నది.

ఒకప్పుడు స్వాతంత్ర్యం కోసం భారత్ సహాయం కోరిన బంగ్లాదేశ్ నేడు విశ్వాసఘాతుకానికి తలపడుతున్నది. ఒకసారి బంగ్లా పాలకులు గతాన్ని పునశ్చరణ చేసుకోవాలి. బెంగాల్లో అక్రమంగా ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ వలసవాదులను దేశం విడిచిపెట్టి పోవాలని చెబుతున్నా, బంగ్లాదేశ్ ప్రభుత్వం అలాంటి వారిని తమ దేశంలోకి రానివ్వడం లేదు.

చాలా కాలంగా మన దేశం అగ్రరాజ్యాల ఒత్తిడి వలనో, ఐక్యరాజ్య సమితి హితవచనాలు పాటించడం వలనో పొరుగు దేశాలు మనదేశాన్ని అనేక ఇబ్బందులకు గురిచేశాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఉగ్రవాదం వలన భారత్ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మొసలి కన్నీరు కార్చిందే తప్ప, పాకిస్తాన్ పట్ల కఠిన వైఖరి తీసుకోలేకపోయింది.

ద్వైపాక్షిక ఒప్పందాలతో సమస్యలను పరిష్కరించుకోవాలని చాలా దేశాలు నచ్చచెప్పడం జరిగింది. మన దేశం కూడా ఎన్నోసార్లు పాక్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలకు సిద్ధమైంది. అయితే పాక్‌తో కుదుర్చుకున్న ప్రతి ఒప్పందాన్ని పాక్ పాలకులు తుంగలో తొక్కి, విధ్వంస రచనకు తెరతీశారు. ఉగ్రవాదులకు ఊతమిచ్చిన పాక్ ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లోకి నెట్టబడింది. పాకిస్తాన్ భవితవ్యమే అగమ్యగోచరంగా మారింది. పాక్ ప్రజలు కూడా పాక్ ప్రేరిత ఉగ్రవాదం పట్ల అసహనంగా ఉన్న మాట వాస్తవం. పాక్ ప్రభుత్వ విధానాల వల్ల అక్కడి ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది.

రాబోయే రోజుల్లో పాక్‌లో అనేక పరిణామాలు జరగబోతున్నాయి. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడినట్టు మన పొరుగునున్న దాయాది దేశం పాకిస్తాన్ తన స్వీయ తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకోబోతున్నది. పాక్‌లో అంతర్యుద్ధం చెలరేగింది. పాకిస్తాన్ అరాచకాలతో, సైనిక చర్యలతో, ఉగ్రవాదుల విధ్వంసకాండతో అనునిత్యం బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న పాక్‌లోని పలు ప్రాంతాల ప్రజలు భారత్లో విలీనం కావాలని బలంగా కోరుకుంటున్నారు.

పాక్‌లోని బలూచిస్తాన్, సింధ్‌తో పాటు పాక్‌లోని పలు ప్రాంతాల ప్రజలు పాక్ పాలకులకు, సైన్యానికి వ్యతిరేకంగా తీవ్రమైన పోరు కొనసాగిస్తున్నారు. పాక్ పాలకులపై అక్కడి ప్రజలకు నమ్మకం లేదు. చైనాతో అంటకాగి, ఇబ్బడిముబ్బడిగా ఆయుధాలను కొనుగోలు చేసి, తీవ్రవాదంతో రాజ్యాధికారం చెలాయించిన పాక్ నేడు అత్యంత దైన్య స్థితిలో ఉంది.

— సుంకవల్లి సత్తిరాజు