24thJunechintana | విష్ణువు భిక్షతో బ్రహ్మకపాల మహిమ
24thJunechintana | విష్ణువు భిక్షతో బ్రహ్మకపాల మహిమ
24thJunechintana | బ్రహ్మ ఊర్ధ్వముఖానికి శివుడి శాపసమాన శిక్ష
బ్రహ్మహత్య పాపం నుంచి విముక్తి కోసం భిక్షాటన
బదరీనారాయణ క్షేత్రం ఆవిర్భావం
పితృదేవతల మోక్షానికి బ్రహ్మకపాలం ప్రాధాన్యం
24thJunechintana | శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు పురోహితుడైన బ్రహ్మ పంచముఖుడు. నాలుగు ముఖాలతో మంత్రోచ్ఛారణ చేస్తున్నాడు. కానీ ఆయన ఊర్ధ్వముఖం పార్వతీదేవి సౌందర్యానికి మోహపరవశమై చేష్టలుడిగి చూస్తుండిపోయింది. ఇది గమనించిన పరమశివుడికి కోపం వచ్చింది. బ్రహ్మకు బుద్ధి చెప్పాలని చేయి చాచి ఒక దెబ్బ వేశాడు.
మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా! దాని ప్రభావానికి బ్రహ్మ ఊర్ధ్వముఖం తెగిపోయింది. కానీ కింద పడలేదు. శివుడి అరచేతికి అతుక్కుపోయింది. అది ఎంత విదిలించినా ఆయన చేతిని వదలలేదు. క్రమక్రమంగా ఎండిపోయి చివరికి కపాలంగా మారిపోయింది.
బ్రహ్మ అపరాధం చేశాడు. దానికి ఆదిదేవుడు శిక్ష వేయాల్సి వచ్చింది. అయితే అది సరాసరి బ్రహ్మహత్యగా పరిణమించి, ఆ పాపం అంతటి మహాదేవుడికీ అంటింది. జగద్గురువు, మహాతపస్వి అయిన ఆయనకూ ఆ పాపఫలం తప్పలేదు. దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగిన విషయం చెప్పి, తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గం ఏమిటో సూచించమన్నాడు.
“దేవాదిదేవా! పరమజ్ఞానివి. నీకు తెలియని ధర్మం లేదు. ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి, శాసించగలవాడివి. అయినా మాపై కృపతో ఒక సలహా ఇవ్వమని కోరావు. కనుక మా జ్ఞానపరిమితికి తోచింది చెబుతున్నాము. ఈ కపాలాన్నే భిక్షాపాత్రగా భావించి ఇంటింటికీ తిరుగుతూ, ప్రతిచోటా నీ పాపమేమిటో చెప్పుకుంటూ భిక్షమడుగుతూ వెళ్లు. కొంతకాలానికి ఆ పాపం తరిగిపోయి ఈ కపాలం రాలిపోవచ్చు” అన్నారు దేవతలు.
పరమశివుడికి అది ఉచితమనిపించింది. భిక్షాటనమూర్తిగా మారి ముల్లోకాలు తిరుగుతూ మళ్లీ తన వివాహం జరిగిన చోటుకే చేరాడు. హిమాలయ పర్వతాల్లో తాను పూర్వం కేదారేశ్వరుడిగా అవతరించి ఉన్నాడు. అందుకే సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాల్లోని శిఖరాలను, నదులను ఆయనకు కానుకగా ఇచ్చేశాడు.
అది తెలుసుకున్న నారాయణుడు శివుడి దగ్గరకు వచ్చి, “పరమశివా! నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలున్నాయి కదా! ఈ బదరీవనంతో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా?” అని అడిగాడు.
నారాయణుడంతటివాడు అడిగితే తాను ఎలా ఇవ్వకుండా ఉండగలడు? పరమసంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు. అప్పటి నుంచి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడు. ఆ తరువాత శివుడు ఆయన దగ్గరకే భిక్షకు బయలుదేరాడు. ఈ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు. “పరమశివుడే నా దగ్గరకు భిక్షకు వస్తున్నాడు. వాస్తవంగా ఇది ఆయన ఇల్లు. ఆయన తన ఇంటికే భిక్షకై వస్తున్నాడంటే అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట. ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్ధితంగా మార్చాలి.
ఇది శివక్షేత్రం. ఇందులో నేను (విష్ణువు) ఉన్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మకపాల సహితుడై వస్తున్నాడు. ఈ కపాలం బ్రహ్మదేవుడి ఊర్ధ్వముఖానిది. అంటే అది అధోలోకాలను, ఊర్ధ్వలోకాలను అనుసంధానం చేసే ముఖం. చిరకాల శివహస్తస్పర్శ వల్ల దానిలోని దుర్భావనలన్నీ నశించిపోయాయి. ఇప్పుడది పరమపవిత్రం. దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి. దానికి తోడు నా శక్తి, శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి” అని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు.
అంతే! ఆ కపాలం కాస్తా ఊడి కిందపడి శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది. అప్పటి నుంచి బదరీనారాయణ స్వామి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారియైన బ్రహ్మకపాలం మహాక్షేత్రమైంది. తమ పితృదేవతలను పునరావృతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునేవారికి అది రాజమార్గమై నిలిచింది.
— దండంరాజు రాంచందర్ రావు
