నది దాటి ఏలూరు జిల్లాలోకి పెద్దపులి

సిరివాక పరిసరాల్లో సంచారం.. అప్రమత్తమైన అటవీ శాఖ

ప్రజలు భయపడొద్దు.. పాపికొండల అటవీ ప్రాంతంలోనే ఉందన్న అధికారులు

ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ : గత కొంతకాలంగా అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉన్న పెద్దపులి తాజాగా నది దాటి పోలవరం జిల్లా నుంచి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించినట్లు జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అది సిరివాక పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారని వెల్లడించారు.

పులి కదలికలపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కొరుటూరు ప్రాంతంలోనే రాత్రి బస చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని తెలిపారు.

పులిని పట్టుకునేందుకు నదీ తీరం వెంబడి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అవసరమైన బోన్లు, లాజిస్టిక్స్ సదుపాయాలు, వెటర్నరీ బృందాలను సిద్ధంగా ఉంచామని, పులిని ట్రాంక్విలైజ్ చేసే అవకాశాలపై కూడా అధికారులు పనిచేస్తున్నారని వివరించారు.

పులి సంచరిస్తున్న ప్రాంతంలో జనావాసాలు లేవని, ప్రస్తుతం అది పాపికొండలు నేషనల్ పార్క్ పరిధిలోనే ఉన్నందున ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో పాటు అటవీ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు జిల్లా, మండల స్థాయి యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు.

నది పరివాహక ప్రాంతాలకు గ్రామస్తులు వెళ్లవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చేపల వేట, పశువుల మేత కోసం అక్రమంగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్న అటవీ శాఖ, పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా పేరంటపల్లి శివాలయం వరకు పర్యాటక కార్యకలాపాలను మూడు రోజుల పాటు నియంత్రించాలని టూరిజం శాఖకు జిల్లా అటవీ శాఖాధికారి లేఖ రాసినట్లు తెలిపారు.