నాలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవు

కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్
అక్రమ నిర్మాణాలు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని మేయర్ సూచన

గోదావరిఖని, ఆంధ్రప్రభ : రామగుండం కార్పొరేషన్ పరిధిలో నాలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని నగర మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్, వినాయక నగర్ ప్రాంతాల్లో మేయర్ విస్తృతంగా పర్యటించారు.

మూడో డివిజన్‌లోని పలు కాలనీల్లో కాలినడకన పర్యటించిన మేయర్.. ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో మురుగునీరు, వృథా నీరు వెళ్లేందుకు నిర్మించిన నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదని స్పష్టం చేశారు.

డివిజన్ పరిధిలో శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించడం, రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, పిచ్చి మొక్కలు, పొదలను తొలగించే పనులు చేపట్టారు.

ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ.. నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు. మూడో డివిజన్‌లో డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాల కారణంగా మురుగునీరు నిలిచిపోతున్న సమస్యను గుర్తించినట్లు తెలిపారు.

అక్రమ నిర్మాణాల తొలగింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రజలందరూ సహకరించాలని కోరారు.

రామగుండం నగరాన్ని సమస్యల రహితంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులను ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సహకారంతో మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మేయర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్, ఏఈలు తేజస్విని, మనోజ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగభూషణం, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.