కేంద్ర జలశక్తి మంత్రికి హరీశ్‌రావు లేఖ

  • తెలంగాణ నీటి హక్కులను కాపాడాలి..

ఆంధ్రప్రభ : తెలంగాణకు చట్టబద్ధంగా లభించిన నీటి హక్కులను పరిరక్షించాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్-85 ప్రకారం కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశ ఎజెండాలో చేర్చిన 18.3.1, 18.3.6, 18.3.11 అంశాలను వెంటనే ఉపసంహరించాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. ఈ అంశాల ద్వారా తెలంగాణలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటికే లభించిన చట్టబద్ధ అనుమతులను తిరిగి సమీక్షించే ప్రయత్నం జరుగుతోందని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక, జలవిజ్ఞాన, చట్టపరమైన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఆయా ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేశాయని ఆయన గుర్తు చేశారు. భారత ప్రభుత్వమే ఇచ్చిన అనుమతులను సమీక్షించే లేదా రద్దు చేసే అధికారం ఏ అనుబంధ సంస్థకూ లేదని స్పష్టం చేశారు.

ఇది రాజకీయ అంశం కాదని, తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కులు, సాగునీటి భద్రత, తాగునీటి అవసరాలు, లక్షలాది మంది రైతుల భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశమని హరీశ్‌రావు తన లేఖలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని నిబంధనలను యథాతథంగా అమలు చేస్తూ తెలంగాణ ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం పరిరక్షించాలని, జీఆర్‌ఎంబీ చట్టపరమైన పరిధిని మించకుండా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చట్టబద్ధంగా లభించిన నీటి హక్కులను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.