ఎస్ఐఆర్ గడువు పెంచాలని ఎన్నికల కమిషనర్‌కు వినతి

ఓటర్ల నమోదు ప్రక్రియలో సాంకేతిక సమస్యలపై మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆందోళన

అమరావతి విజయవాడ, ఆంధ్ర‌ప్ర‌భ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించి గడువును పొడిగించాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు ఎన్నికల కమిషనర్‌ను కోరారు. సోమవారం కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన ఫారూఖ్ షుబ్లీ, సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియపై ముస్లిం సమాజంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారి ఓటు హక్కులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, ఆధార్, ఓటరు కార్డుల్లో పేర్ల నమోదు వ్యత్యాసాల కారణంగా ఆన్‌లైన్ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 65 నియోజకవర్గాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి ఫారం-6, ఫారం-8 నమోదుపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.ఎస్ఐఆర్ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగితే అర్హులైన వారికి ప్రయోజనం చేకూరుతుందని, నెల రోజుల గడువు సరిపోదని పేర్కొంటూ గడువు పెంచాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలపై ఎన్నికల కమిషనర్ సానుకూలంగా స్పందించి అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.