Nagar Kurnool | ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం..

నాగర్‌కర్నూల్ జిల్లాలో రవాణా సౌకర్యాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దుందుభి వాగుపై రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మంత్రి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పట్టుదలతోనే ఈ ప్రాంత ప్రజల చిరకాల కల సాకారమవుతోందని అన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, నాగర్‌కర్నూల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని తాడూరు మండలం సిర్సివాడ గ్రామం వద్ద దుందుభి వాగుపై రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, జడ్చర్ల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి, తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క (ధనసరి అనసూయ) సోమవారం శంకుస్థాపన చేశారు.

ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల నాటి కలను సాకారం చేయడంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అసాధారణమైన పట్టుదలతో కృషి చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ప్రశంసించారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటి సాధన కోసం నిరంతరం శ్రమించే నాయకులు సమాజానికి ఎంతో అవసరమని, అలాంటి నాయకులను ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరించాలని మంత్రి సీతక్క తెలిపారు.

సిర్సివాడ గ్రామం వద్ద దుందుభి వాగుపై రూ.20 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈ వంతెన నిర్మాణం కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదని, వేలాది మంది ప్రజల జీవితాలను సులభతరం చేసే చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న కల నేడు నిజమవుతుండడం ఆనందంగా ఉందని బ్రిడ్జి నిర్మాణానికి నాణ్యత ప్రమాణాలు పాటించి వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి, ప్రజలకు జన్మదిన కానుకగా ఈ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలా చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రత్యేక అభినందనలకు అర్హులని కొనియాడారు.

ఈ బ్రిడ్జి నిర్మాణంతో నాగర్‌కర్నూల్, జడ్చర్ల నియోజకవర్గాల మధ్య అనుసంధానం మరింత బలపడుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో దుందుభి వాగు ఉద్ధృతంగా ప్రవహించే సమయంలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని చెప్పారు. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, అత్యవసర సేవలు పొందాల్సిన ప్రజలందరికీ ఈ వంతెన ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

వాగులపై వంతెనలు లేకపోతే గ్రామీణ ప్రాంత ప్రజలు ఎంతటి కష్టాలు పడతారో తనకు బాగా తెలుసని మంత్రి చెప్పారు. తాను కూడా అడవి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తినేనని, ప్రజల ఇబ్బందులను దగ్గరగా చూసిన అనుభవం తనకు ఉందన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కోసం అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి వివరించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం బలపడుతుందని, కుటుంబం బలపడితే సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని ఆమె తెలిపారు. మహిళలు అందరూ స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్న స్థాయి వ్యాపారాల నుంచి పెద్ద స్థాయి పరిశ్రమల వరకు మహిళలు ముందుకు రావాలని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మహిళల అభివృద్ధినే రాష్ట్ర అభివృద్ధిగా భావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఒకేరోజు సుమారు 8 వేల మహిళా భవనాలకు శంకుస్థాపన జరగడం దేశంలోనే ఒక చారిత్రాత్మక ఘట్టమని తెలిపారు. ప్రస్తుతం ఆ భవనాల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

మహిళలు జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలకు వచ్చినప్పుడు వసతి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా మహిళా భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ఒక్కో భవనానికి సుమారు రూ.5 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలు, సమావేశ మందిరాలు, శిక్షణ కేంద్రాలు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఈ భవనాలు ఉపయోగపడతాయని అన్నారు.

రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మహిళలు కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలో కూడా రాణించాలని కోరారు. ముఖ్యంగా హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో పర్యాటకం, ఆహార ఉత్పత్తులు, చేతివృత్తులు, సేవా రంగాల్లో వ్యాపార అవకాశాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
నాగర్‌కర్నూల్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మంత్రి తెలిపారు. తన శాఖ ద్వారా ఇప్పటికే సీఆర్ నిధుల కింద రూ.30 కోట్లు, ఎంఆర్ నిధుల కింద రూ.13 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.15 కోట్లు, వివిధ రహదారి అభివృద్ధి పనులకు రూ.84 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడతాయని హామీ ఇచ్చారు.

ఇంకా నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు తన శాఖ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు.

ప్రజల చిరకాలిక కోరిక నెరవేరింది : ఎంపీ డాక్టర్ మల్లు రవి…

నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల చిరకాలిక కోరిక నెరవేరిన సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దుందుభి వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరగడం ఈ ప్రాంత ప్రజలకు చారిత్రాత్మక ఘట్టమని తెలిపారు.

2008లో తాను జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో సిర్సివాడ గ్రామం జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో ఉండేదని గుర్తు చేశారు. అప్పటి నుంచే ఈ ప్రాంత ప్రజల రాకపోకల సమస్యలను గుర్తించి వంతెన నిర్మాణం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదన్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో చివరకు బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం లభించిందని తెలిపారు.
ఈ వంతెన నిర్మాణం కోసం నిరంతరం కృషి చేసిన నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డిను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయమని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా వాసి కావడం వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోందని అన్నారు.

విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలు, ఆధునిక సౌకర్యాలతో కూడిన పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందని ఎంపీ వెల్లడించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి తీసుకురానున్నట్లు ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు.

ఎమ్మెల్సీ డాక్టర్ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ… ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న 50 ఏళ్ల చిరకాల స్వప్నం నేడు సాకారం కావడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజల కలను నిజం చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్కకు ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్సీ డాక్టర్ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి తెలిపారు.

ప్రజల అవసరాలను గుర్తించి, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన అన్నారు. రాజకీయాలు అనేవి ప్రజాసేవకు వేదిక కావాలని, నీతి, నిజాయితీ, పారదర్శకతతో ప్రజల కోసం పనిచేయడమే తమ కుటుంబ లక్ష్యమని తెలిపారు. తాను రాజకీయ జీవితంలో అనుసరిస్తున్న విలువలు, సిద్ధాంతాలనే తన కుమారుడు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి కూడా కొనసాగిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నారని చెప్పారు.

ఈ ప్రాంత ప్రజల రాకపోకల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే ఈ వంతెన నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కొత్త ఊపిరి లభిస్తుందని, వ్యవసాయం, వ్యాపారం, విద్య, వైద్య రంగాలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా నాగర్‌కర్నూల్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన నిధులు, సహాయ సహకారాలు అందించాలని మంత్రి సీతక్కను ఎమ్మెల్సీ కోరారు.

ప్రజల సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలంతా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వంతెన నిర్మాణం ఈ ప్రాంత చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఎమ్మెల్సీ డాక్టర్ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

50 ఏళ్ల కల సాకారం…. : ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి

నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న 50 సంవత్సరాల కల మంత్రి సీతక్క చేతుల మీదుగా నెరవేరడం ఎంతో ఆనందంగా ఉందని నాగర్‌కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ ప్రజల తరఫున మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంతో మంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు గతంలో ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదని, అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో మంత్రి సీతక్క చొరవతో ఈ కల సాకారం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

నాగర్‌కర్నూల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి సీతక్క ఇప్పటికే సుమారు రూ.1000 కోట్ల మేర నిధులు మంజూరు చేశారని, తాజాగా మరో రూ.20 కోట్ల నిధులను కూడా కేటాయించడం ఆమెకు నియోజకవర్గంపై ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమని, ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి తెలిపారు.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ… సీర్సవాడ గ్రామం వద్ద దుందుభి వాగుపై హై లెవల్ వంతెన నిర్మాణం పూర్తయితే ఊర్కొండ, మాదారం, కల్వకుర్తి ప్రాంతాల ప్రజలకు నాగర్ కర్నూల్ రావడం తో పాటు, నాగర్ కర్నూల్ నుండి హైదరాబాద్‌తో పాటు శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు మరింత సులభతరం అవుతాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు.

ఈ వంతెన నిర్మాణం ద్వారా దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఈ ప్రాంత ప్రజల చిరకాలిక ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేసి, వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నందుకు ఆమెను అభినందించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం అనే ద్వంద్వ లక్ష్యాలతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పనిచేస్తోందని అన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన దుందుభి వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర మంత్రి సీతక్క శంకుస్థాపన చేయడం ఆనందదాయకమని, ఈ వంతెన నిర్మాణంతో స్థానిక ప్రజల ఎన్నో ఏళ్ల ఆశ నెరవేరనుందని తెలిపారు.

గత ప్రభుత్వాలు ఉమ్మడి పాలమూరు జిల్లాపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయని, జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు.

గత పాలకులు హామీలకే పరిమితమై ప్రజలను మోసం చేశారని, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రం మాటలు కాకుండా చేతల్లో చూపిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ… రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అందరికీ అక్కలాంటివారని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆమె ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా దుందుభి వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయమని తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, జడ్చర్ల నియోజకవర్గాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రయాణ సమయం తగ్గి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.

దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఈ సమస్యకు ప్రజా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు. పేద మరియు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సంక్షేమ పథకాల అమలుతో పాటు విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి అవసరాలకు అనుగుణంగా పాలన అందిస్తున్న ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.