Teacher-Shortage- : పంతుళ్లు అక్కర్లేదు Andhra Prabha Top Stoey

Teacher-Shortage- : పంతుళ్లు అక్కర్లేదు Andhra Prabha Top Stoey

  • నూరు శాతం ఫలితాలు సాధ్యమే
  • ర్యాంకులన్నీ పెద్ద బిడ్డలకే
  • బోధనం, అభ్యసనం, నైపుణ్యం
  • అంతు చిక్కని మెలిక

( అర్ధవీడు ఆంధ్రప్రభ )

పరీక్ష ఫలితాలు బోధన, అభ్యసనాల ప్రతిబింబం. సాధించిన ఉత్తీర్ణత శాతం, పొందిన ర్యాంకుల స్థానాలు అమలులో వున్న విద్యా స్థాయి కొలమానాలు. అయితే ఉత్తీర్ణతలోనూ, ర్యాంకులలోనూ పూసల్లో దారంలా ఇమిడి వుండే జ్ఞానం, నైపుణ్యాలను పరీక్ష ఫలితాలు ప్రతిఫలిస్తున్నాయా అన్నది ప్రాథమిక ప్రశ్న. తరగతి గదిలో దేశ భవిష్యత్తు తీర్చి దిద్దబడుతుంది అన్న కొఠారి కమిషన్ వ్యాఖ్యానానికి ఆ ఫలితాలు ఏ దిశానిర్దేశం చేస్తున్నాయన్నది అనుబంధ ప్రశ్న. దీనికి అర్థవీడు మండలంలో తాజాగా విడుదలై సంబరాలు చేసుకున్న పదో తరగతి పరీక్ష ఫలితాలు దీటైన సమాధానం ఇవ్వగలవా అన్నది సహజంగా కలిగే సందేహం.

Teacher-Shortage- : అన్నీ మెగా ఫలితాలే

అర్థవీడు మండలంలో 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షలో విద్యార్థులు 98.4 శాతం ఉత్తీర్ణత సాధించారు. ర్యాంకులూ అదరహో అన్నాయి. 374మందికి గాను 368 మంది విద్యార్థులు పాసయ్యారు. అందరూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే. కేవలం నలుగురు మాత్రమే తప్పారు. ఓ ఇద్దరు మాత్రం పరీక్షకు గైర్హాజరయ్యారు. ఈ రీత్యా ఫలితాల పట్ల సహజంగానే హర్షాతిరేకాలు వ్యక్తమవుతాయి. అయ్యాయి కూడా.! ప్రయివేటు విద్యా వ్యాపార ప్రచార హోరు ప్రభావంతో వీరూ ర్యాంకుల్లో గొప్పలు పోవడం షరామామూలే. కానీ, సుశిక్షుతులైన ఉపాధ్యాయుల బోధనకు, విద్యార్థుల శాస్త్రియ అభ్యసనానికి మధ్య జరిగిన ప్రజ్ఞ, నైపుణ్యాల సాధన ప్రక్రియల మదింపు ఫలితాల్లో ప్రతిబింభించాయా అన్నది సందేహత్మక చర్చ.

Teacher-Shortage- : ప్రమాణాలా – అడగొద్దు

మండల మొదటి ర్యాంకు రంగాపురం జడ్పీహెచ్ఎస్ కు దక్కింది. తృతీయ ర్యాంకు వద్దే నాగులవరం జడ్పీ నిలిచిపోయింది. ఈ రెండింటిని పోల్చినపుడు బోధన, అభ్యసన ప్రమాణాల, ప్రతిఫలాల నిర్వచనమే మారిపోతోంది. రంగాపురం జడ్పీ లో హింది, రసాయన శాస్త్రం బోధించడానికి ఉపాధ్యాయులు లేరు. అయినా ఈ పాఠశాల మండలంలో మొదటి ర్యాంకు సాధించింది. నాగులవరం జడ్పీలో ఉపాధ్యాయుల కొరతే లేదు. ఫలితాలు మాత్రం తిరగబడ్డాయి. మండల స్థాయిలో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది. ఈ ఫలితాలు ఏ విద్యా ప్రమాణాలకు సంకేతం? బోధన వున్నా అభ్యసనం లేదనా? బోధన లేకపోయినా ఏక లవ్యుడిలా విద్యార్థుల్లో ప్రావీణ్యం ఉందనా? ఇంకేమైనా చిట్కాలు ఉన్నాయనా?

Teacher-Shortage- : ఇది ఏ ప్రావీణ్యం

దొనకొండ జడ్పీ లో ఉపాధ్యాయుల కొరత లేదు. 96.2 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించింది. ఒకరు సోషల్ స్టడీస్ లో ఫెయిల్ అయ్యారు. ఇది సహజం. కానీ, రంగాపురం జడ్పీ లో హింది, రసాయన సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరు. కానీ ఈ సబ్జెక్టులు తప్పలేదు. ఉపాధ్యాయుడు వున్నా సోషల్ తప్పారు. యాచవరం జడ్పీ లో రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు లేరు. కానీ లెక్కలు తప్పారు. పీఎస్ తప్పలేదు. బోగోలు, కాకర్ల జడ్పీ ల లో బోటనీ, ఇంగ్లిష్ టీచర్లు లేరు. కానీ వంద శాతం ఫలితం సాదించాయి. పాపినేని పల్లి జడ్పీ లో రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు లేరు. 96.4 శాతం ఉత్తీర్ణత వచ్చింది. ఒకరు మాత్రమే తప్పారు. ఆ ఒక్కరు పీఎస్ తో పాటు తెలుగు, మ్యాథ్స్, బయాలజీ, సోషల్ కూడా ఫెయిల్ అయ్యారు. అర్థవీడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కథ వింతలో వింత. ఇక్కడ తెలుగు, ఇంగ్లిష్, లెక్కలు బోధించడానికి ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరేసి టీచర్లు ఉండాలి. ఒక్కొక్కరే వున్నారు. సోషల్ కీ ఇద్దరు ఉండాలి. కనీసం ఒక్కరూ లేరు. అయినా నూరు శాతం ఫలితం సాధించింది. సహజంగా ఉపాధ్యాయుడు వున్న సబ్జెక్టు ల్లోనూ తప్పుతుంటాం. అలాంటిది బోధన లేకపోయినా ఉత్తీర్ణత ఉన్నత స్థాయిలో రావడం ఎలాంటి నైపుణ్యం? ఈ తరహా నైపుణ్యం దేశ భవిష్యత్తుకు లేదా ఆ విద్యార్థుల వ్యక్తిగత ఉన్నతికి ఎలాంటి దిశానిర్దేశం చేస్తుంది. ఈ ఫలితాలు ఏ వ్యక్తిత్వానికి అంకురార్పణ చేస్తాయి. ఏ సామాజిక బాధ్యతకు ఊతమిస్తాయి. ఇవి నల్లమల బిడ్డల భవిష్యత్ పై తలెత్తే ప్రశ్నలు. విద్యా ప్రమాణాల శాస్త్రీయత పై కమ్ముకున్న మబ్బులు.