నేటి నుంచి రైతు వేదికల్లో ‘విత్తన మేళా’
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి వ్యవసాయ డివిజన్ పరిధిలోని అన్ని రైతు వేదికల్లో ఈ నెల 23 నుండి 30వ తేదీ వరకు ‘విత్తన మేళా’ నిర్వహించనున్నట్లు సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ మేళాలో విత్తన కంపెనీలు, డీలర్లు స్టాళ్లను ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచుతారన్నారు. ఈ వానాకాలం సీజన్ కోసం ప్రభుత్వం సూచించిన హెచ్ఎంటీ సోనా, బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, జైశ్రీరామ్, కూనరం 7715, కేఎన్ఎమ్ 1638, డబ్ల్యూజీఎల్ 44 వరి విత్తనాలు రైతు వేదికల్లో లభిస్తాయని పేర్కొన్నారు. విత్తనాలు కావలసిన రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలని, డివిజన్ పరిధిలోని రైతాంగం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏడీఏ కోరారు.
