ఎంజేపీ పాఠశాల, కళాశాలలో అక్రమాలపై విచారణ జరపాలి
ఎంజేపీ పాఠశాల, కళాశాలలో అక్రమాలపై విచారణ జరపాలి
- జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించిన టీజీవిపి నాయకులు
ఇచ్చోడ, ఆంధ్రప్రభ : ఇచ్చోడ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాల, కళాశాలలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీజీవీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొట్టూరు ప్రవీణ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఇచ్చోడ మండల కేంద్రంలోని ఎంజేపీ బాలుర పాఠశాల, కళాశాలలో గత ఫిబ్రవరి 18న ఫేర్‌వెల్ పార్టీ పేరిట విద్యార్థుల నుంచి రూ.500 నుంచి రూ.1,000 వరకు వసూలు చేసి మొత్తం సుమారు రూ.1.25 లక్షలు సేకరించారని ఆరోపించారు. అలాగే సంక్రాంతి పండుగ సమయంలో విద్యార్థులు ఆలస్యంగా వచ్చారనే కారణంతో కూడా డబ్బులు వసూలు చేసినట్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు టీజీవీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా కొంతమంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తగిన అర్హతలు లేకుండానే నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్‌సీఓ జిల్లా కేంద్రంలో అందుబాటులో లేకుండా పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహిస్తూ, ప్రభుత్వ అలవెన్సులను దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి, అక్రమ వసూళ్లకు పాల్పడిన ఆర్‌సీఓ, ప్రిన్సిపాల్, హౌస్ మాస్టర్లతో పాటు నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
