కృష్ణ‌మ్మ తీరాన యోగానందం..

కృష్ణ‌మ్మ తీరాన యోగానందం..

విజ‌య‌వంతంగా విద్యార్థుల థీమ్ యోగా
యోగా విద్యార్థి జీవితంలో కొత్త వెలుగులు నింపుతుంది
జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

భవానిపురం, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా నది తీరంలో బెరం పార్కులో ఇంట‌ర్మీడియెట్ విద్యా విభాగం ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన విద్యార్థుల థీమ్ యోగా కార్యక్రమం శనివారం ఉత్సాహభరిత, ఆహ్లాద‌క‌ర వాతావరణంలో విజయవంతంగా జరిగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని యోగా ఆసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ, యోగా విద్యార్థుల జీవితంలో సానుకూల మార్పులకు నాంది పలుకుతుందని అన్నారు. యోగా సాధన ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత పెంపొందుతాయని తెలిపారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి లక్ష్యాలను సాధించడానికి యోగా ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన భావితరాల నిర్మాణానికి యోగా పునాది వంటిదని, ప్రతి విద్యార్థి నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. సుసంప‌న్న, ఆరోగ్య‌, ఆనంద ఆంధ్ర ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా యోగాంధ్ర కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంద‌ని.. యోగాతో ఆనందమ‌య జీవితాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌న్నారు. కార్య‌క్ర‌మంలో విద్యార్థుల ఆర్టిస్టిక్ యోగా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆక‌ట్టుకున్నాయి. కార్య‌క్ర‌మంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్య అధికారి ప్ర‌భాక‌ర్‌, జూనియ‌ర్ క‌ళాశాల‌ల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు.