మద్యం విధానంపై ప్రశ్నించడం తప్పా..

మద్యం విధానంపై ప్రశ్నించడం తప్పా..

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు
కారుమూరి సునీల్ అరెస్టు దారుణం..
వైసిపి యువజన విభాగం ప్రెసిడెంట్ కొరివి చైతన్య..

విజయవాడ, ఆంధ్రప్రభ : బీసీ వర్గానికి చెందిన వైసీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్య ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. శనివారం విజయవాడలోని వైసీపీ జిల్లా కార్యాలయంలోనిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ హయాంలో మద్యం విక్రయాలు పారదర్శకంగా జరిగాయని, బెల్ట్ షాపులను నియంత్రించడంతో పాటు ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

అధిక ధరలకు విక్రయించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మద్యం విక్రయాలపై ప్రశ్నించిన వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, మద్యం విక్రయాల్లో వచ్చే కమీషన్లు కరకట్ట ప్యాలెస్‌కు వెళుతున్నాయని ఆరోపించారు. జిల్లా యువజన విభాగం కార్యదర్శి సుకుందరావురావు మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిదేనని పేర్కొన్నారు.

లోకేశ్ ప్రజలకు మంచి పాలన అందించాలని, “రెడ్ బుక్” రాజ్యాంగం కాదని అన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని వెనకేసుకోవడం కాకుండా ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించాలని సూచించారు. ప్రజల తరఫున నిలబడితేనే నిజమైన నాయకత్వం చాటుకున్నట్టవుతుందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శులు పెద్దిరెడ్డి శివారెడ్డి, షేక్ మహారాజ్, జిల్లా యువజన విభాగం కార్యదర్శి బొడ్డు తరుణ్, పశ్చిమ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు కేసరి రాజశేఖర్ రెడ్డి, మండల యువజన విభాగం అధ్యక్షుడు బొడ్డు అశోక్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.