చీపుర్లు పట్టిన కలెక్టర్, ఎంపీ.. స్వచ్ఛతకు నాంది!
చీపుర్లు పట్టిన కలెక్టర్, ఎంపీ.. స్వచ్ఛతకు నాంది!
స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు..
యోగాంధ్ర-2026కు జిల్లావ్యాప్తంగా 4,600 కేంద్రాల్లో ఏర్పాట్లు
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసరాలు, ప్రధాన వీధులు, ప్రజా ప్రదేశాల్లో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వయంగా పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ గత ఏడాది జనవరిలో ప్రారంభమైన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం జిల్లాలో నిరంతరంగా కొనసాగుతోందని తెలిపారు. పరిశుభ్రమైన పరిసరాల నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం, ప్రజా ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ప్రజలకు సూచించారు.
రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని కాలువలు పూడికతో నిండిపోవడం కారణంగా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించి, వాటి పరిష్కారానికి మున్సిపల్, రైల్వే శాఖల సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కాలువల పూడికతీత పనులు, అవసరమైన చోట్ల స్లాబ్‌ల ఏర్పాటు, అదనపు డస్ట్‌బిన్‌ల ఏర్పాటు ద్వారా పరిశుభ్ర వాతావరణాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు.
నంద్యాల మున్సిపాలిటీలో గత నాలుగు వారాలుగా చేపడుతున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం ద్వారా పేరుకుపోయిన పాత చెత్తను పూర్తిగా తొలగించి, వ్యర్థాలను వర్గీకరించి కంపోస్టింగ్ యూనిట్లు, బయోడైజెస్టర్ ప్లాంట్లకు తరలించి సేంద్రియ ఎరువులుగా మార్చే చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా నంద్యాలను మరింత పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా, ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిరోధించడంతో పాటు రోడ్లపై చెత్త వేయకుండా పరిశుభ్రతను జీవనశైలిలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛత కార్యక్రమాలు ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతగా భావించి స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు.
యోగాంధ్ర-2026ను విజయవంతం చేయాలని అనంతరం కలెక్టర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నిర్వహించనున్న యోగాంధ్ర-2026 కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా సుమారు 4,600 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. గ్రామాలు, వార్డులు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఒకేసారి యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో ఇప్పటికే సుమారు నాలుగు లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకోవడం విశేషమని పేర్కొన్నారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుత సాధనమని, దీనిని కేవలం ఒక రోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.
భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన యోగా సంప్రదాయం నేడు అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందుతోందని, ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన సమాజ నిర్మాణానికి యోగా సమర్థవంతమైన మార్గమని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో నిర్వహించనున్న యోగాంధ్ర-2026 కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
