పెద్దపల్లిలో ఇసుక, మట్టి, బూడిద దందా..
పెద్దపల్లిలో ఇసుక, మట్టి, బూడిద దందా..
- రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
- టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో ఇసుక, మట్టి, బూడిద దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శుక్రవారం పెద్దపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అనంతరం మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు అందడం లేదని, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఢిల్లీకి వెళ్లే విషయంలో చూపుతున్నచొరవ రైతులకు ఎరువులు అందించడంలో కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
రైతుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అవినీతి, అలసత్వం కారణంగా పలు సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని కవిత విమర్శించారు. ప్రత్తిపాక రిజర్వాయర్ అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే పట్టించు కోవటం లేదని, ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. డి- 86 కాలువకు 30 నెలలుగా మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని, ముక్తేశ్వర ప్రాజెక్టు పురోగతిపై స్పష్టత లేదన్నారు. భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం, సుల్తానాబాద్ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్య సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
