“ప్రియ మిత్ర్ నరేంద్ర…” హిందీలో మోదీకి వీడ్కోలు పలికిన మాక్రాన్
ఆంధ్రప్రభ : ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరుగు ప్రయాణం అవుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అత్యంత ఆప్యాయంగా వీడ్కోలు పలికారు. భారత్-ఫ్రాన్స్ స్నేహబంధాన్ని ప్రతిబింబించేలా హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మోదీని ఉద్దేశించి మాట్లాడిన మాక్రాన్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వీడియోలో మాక్రాన్ మాట్లాడుతూ.. “ప్రియ మిత్ర్ నరేంద్ర, ముఝే బహుత్ ఖుషీ హుయీ… మై ఆప్కో ఇస్ దౌరే కా స్వాగత్ కర్తా హూం. ఫ్రాన్స్ ఔర్ భారత్ కీ దోస్తీ అమర్ రహే” అంటూ హిందీలో పేర్కొన్నారు. అనంతరం నవ్వుతూ “నా హిందీ సరిగ్గానే ఉందని ఆశిస్తున్నాను” అని వ్యాఖ్యానించారు.
అనంతరం ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ, “డియర్ ప్రైమ్ మినిస్టర్, మీ స్నేహానికి ధన్యవాదాలు. ఫ్రాన్స్ మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీరు ఢిల్లీకి తిరిగి వెళ్లే ముందు పారిస్‌లో మీకు ఎంతో మంది స్నేహితులు ఉండటం నాకు ఆనందంగా ఉంది. వచ్చే ఫిబ్రవరిలో నేను భారత్‌ను సందర్శిస్తాను. మీరు నా నిజమైన మిత్రుడు. మేమంతా మిమ్మల్ని అభిమానిస్తున్నాం. జాగ్రత్తగా ఉండండి”
(డియర్ ప్రైమ్ మినిస్టర్.. ఐ వాంట్ టు థాంక్యూ ఫర్ యువర్ ఫ్రెండ్షిప్.. ఫ్రాన్స్ లవ్స్ యూ.. ఐయామ్ సో హ్యాపీ యూ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ ఇన్ ప్యారిస్ బిఫోర్ గోయింగ్ బ్యాక్ టు డిల్లీ. ఐ విల్ కమ్ టు విజిట్ ఇండియా నెక్స్ట్ ఫెబ్రవరీ.. యూ ఆర్ మై ట్రూ ఫ్రెండ్.. వి లవ్ యూ.. టేక్ కేర్) అంటూ హృదయపూర్వకంగా వీడ్కోలు పలికారు.
జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్ వెళ్లిన ప్రధాని మోదీ, అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. అంతకుముందు నీస్‌లోని విల్లా కెరైలోస్‌లో మాక్రాన్‌తో ప్రత్యేకంగా సమావేశమైన మోదీ, భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపారు.
వివాటెక్-2026 సదస్సులో పాల్గొనడం, ద్వైపాక్షిక చర్చలు నిర్వహించడం, భారతీయ ప్రవాసులతో సమావేశం కావడం వంటి కార్యక్రమాల అనంతరం మోదీ పర్యటన ముగిసింది. మోదీ పర్యటన ముగింపు సందర్భంగా మాక్రాన్ హిందీలో వీడ్కోలు చెప్పడం రెండు దేశాల మధ్య బలపడుతున్న సంబంధాలకు, ఇద్దరు నేతల వ్యక్తిగత స్నేహానికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా మాక్రాన్ హిందీలో మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
